హైదరాబాద్, వెలుగు: జమిలి ఎన్నికలు..రాజ్యాంగంపై దాడేనని సీడబ్ల్యూసీ మెంబర్ పి.చిదంబరం అన్నారు. దేశంలోని పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా శనివారం తాజ్‌కృష్ణా హోటల్ లో చిదంబరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: ఐఐటీ కుర్రోళ్లకు మస్తు గిరాకీ..
‘‘రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థను కేంద్రం ప్రమాదంలోకి నెడుతున్నది. రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. ఆర్థిక వనరులపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేస్తున్నది. వరదలతో హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అయినా అక్కడి సీఎంతో ప్రధాని మాట్లాడలేదు. ఒక్క పైసా సాయం చేయలేదు. మణిపూర్‌లో మే నెలలో అల్లర్లు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ప్రధాని అక్కడికి వెళ్లలేదన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, దాన్ని కంట్రోల్చేసేందుకు చర్యలు చేపట్టట్లేదు’’ అని ఫైర్ అయ్యారు. దేశ భూభాగాన్ని కాపాడడంలో కేంద్రం ఫెయిల్ అయిందని విమర్శించారు. విదేశాంగ మంత్రులు, ఆర్మీ అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా.. చైనా దురాక్రమణలు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు.