నర్వ, వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పాలమూరు రూపురేఖలు మారుస్తానని సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లాలోని నర్వ మండలం కేంద్రం, రాయికోడ్ రాజుపల్లి, పాతర్‌చేడ్ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాను పదేళ్లుగా దోచుకుని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడతామన్నారు. సంగం బండ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడుతూ.. నర్వ మండలానికి జూనియర్ కళాశాల, 30 పడకల ఆసుపత్రి, అంబులెన్స్ అవసరమైన గ్రామాలకు రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పాదయాత్రలో జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, గీత కార్మిక అధ్యక్షుడు నాగరాజు గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.