- సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి
మక్తల్/ఊట్కూర్, వెలుగు : పదేండ్ల రాచరిక పాలనను తెలంగాణ ప్రజలు అంతం చేశారని, ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా తనను గెలిపించాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి కోరారు. గురువారం మక్తల్, ఊట్కూరు మండలాల్లో భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించారు. మక్తల్ మండలంలో కర్ని, ఖానాపూర్, మక్తల్, ఊట్కూరు మండలం పెద్ద జెట్రం, అవుసలోని పల్లి, బిజ్వార్ ల మీదుగా పులిమామిడి గ్రామాల్లో పర్యటించారు. సంగంబండ రిజర్వాయర్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఆగం చేశారన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేసేందుకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషి చేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీ గా గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా అందించాలన్నారు. సంగంబండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. జీవో 69పై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వినతిపత్రం అందించిన సందర్భంగా జలసాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్ నర్సింహా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, వంశీ చంద్రెడ్డిని సన్మానించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, కోళ్ల వెంకటేశ్, విష్ణువర్ధన్ రెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.