పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీతో సర్వే.. జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ

పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీతో సర్వే.. జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ
  • థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం
  • జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ
  • కిన్నెరసాని, ముర్రేడువాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్ 
  • భద్రాచలం టౌన్‌లో ముంపు, మణుగూరు భారజల ప్లాంట్‌కు ముప్పుపైనా స్టడీ చేయించాలని విజ్ఞప్తి
  • తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండి వాదన
  • అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం
  • ఒక్క కిన్నెరసానిపైనే జాయింట్ సర్వేకు ఓకే 
  • గోదావరి–బనకచర్ల లింక్‌ను ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ
  • హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్ ​బ్యాక్​ వాటర్‌‌తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ) అంగీకరించింది. జాయింట్​ సర్వేకు ఒప్పుకోబోమని ఏపీ ఎప్పటిలాగే కొర్రీలు పెట్టగా, థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు పీపీఏ ఓకే చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) టీమ్‌తో సర్వే చేయిస్తామని తెలిపింది. పోలవరం ముంపు సమస్యపై హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీ​ ఆఫీసులో మంగళవారం పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఈఎన్సీ అనిల్​ కుమార్, గోదావరి ఇంటర్​ స్టేట్​ డిస్ప్యూట్స్​ అధికారులు, పీపీఏ ఆఫీసర్లు, ఏపీ సీఈలు పాల్గొన్నారు. పోలవరం ఫుల్​ రిజర్వాయర్ ​లెవల్​ 45.72 మీటర్ల వద్ద తెలంగాణలో ఏర్పడే ముంపుపై మన అధికారులు సవివరంగా పవర్ ​పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి–బనకచర్ల లింక్​ ప్రాజెక్టుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

కిన్నెరసాని నది డీమార్కేషన్, భద్రాచలం ముంపు, మణుగూరు భారజల ప్లాంట్‌‌కు ముప్పు, స్థానికంగా ఉన్న ఆరు వాగులపై పడే ప్రభావంపై జాయింట్​సర్వే చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే జాయింట్​సర్వేకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఏపీ మరోసారి కొర్రీలు పెట్టింది. తాము పోలవరం బ్యాక్​వాటర్‌‌‌‌తో కిన్నెరసాని నదిపై పడే ప్రభావంపై మాత్రమే జాయింట్​సర్వే చేయిస్తామని తెలిపింది. పాత సర్వేలు ఉన్నాయని, ఆ సర్వేలు సరిపోతాయని మొండి వాదనలకు దిగింది. కానీ ఏపీ వాదనలను కొట్టిపారేసిన పీపీఏ.. థర్డ్​పార్టీతో సర్వే చేయిస్తామని స్పష్టం చేసింది.  

ఇవీ ప్రధాన డిమాండ్లు.. 

సీడబ్ల్యూసీ 2023 జనవరి, 2024 ఆగస్టులో నిర్వహించిన టెక్నికల్ కమిటీ సమావేశాల్లో నిర్దేశించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపు, ఆయా ప్రాంతాలకు సరిహద్దుల నిర్ధారణపై కచ్చితంగా జాయింట్​సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 954 ఎకరాల్లో ముంపు ప్రభావం ఉంటుందని.. దానిపై సర్వే, డీమార్కేషన్​కచ్చితంగా చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్​వాటర్‌‌‌‌తో భద్రాచలం టౌన్‌‌లో నదీ ప్రవాహ స్థాయిలను తేల్చాలని కోరారు. భద్రాచలం టౌన్‌‌లోని 8 అవుట్ ఫాల్​రెగ్యులేటర్లు, భద్రాచలం గుడి వద్ద వచ్చే వరద ప్రవాహంపై స్టడీ చేయించాలన్నారు. దీంతో పాటు మణుగూరు భారజల కేంద్రం వద్ద ఏర్పడే ముంపునూ స్టడీ చేయాలని కోరారు. కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల డ్రైనేజీ సమస్యపై నేషనల్​గ్రీన్​ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు డీమార్కేషన్​ చేయించాలని, మరో ఆరేడు స్థానిక వాగుల వద్ద ఏర్పడే వరద తీవ్రత, డ్రైనేజ్​ ప్రభావంపైనా సర్వే చేయించాలన్నారు. భద్రాచలం గుడితో పాటు టౌన్, మణుగూరు భారజల కేంద్రాల రక్షణకు గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​అవార్డు మేరకు ఏపీ రక్షణ చర్యలు చేపట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు దిగువన 36 వాగులు వచ్చి చేరుతున్నాయని, పోలవరం బ్యాక్​ వాటర్‌‌‌‌తో వాటిపై పడే ప్రభావంపై సర్వే చేయించాలని కోరారు. 

భద్రాచలం టౌన్‌‌ ముంపుపైసర్వే చేయాల్సిందే.. 

భద్రాచలం టౌన్‌‌లో వివిధ వాగులు, నదుల ద్వారా వచ్చే వరదను దిగువకు మళ్లించేలా 8 అవుట్‌‌​ఫాల్​రెగ్యులేటర్లు ఉన్నాయని, వాటి వద్ద కూడా సర్వే చేయించాల్సిన అవసరం ఉందని మన అధికారులు వివరించారు. పోలవరం 44.50 మీటర్ల వద్ద విస్టా కాంప్లెక్స్​అవుట్​ ఫాల్ ​రెగ్యులేటర్‌‌‌‌కు భద్రాచలంలోని 50 ఎకరాల క్యాచ్‌‌మెంట్‌‌తో వరద ఉంటుందని పేర్కొన్నారు. 40.25 మీటర్ల వద్ద ఏటపాక రెగ్యులేటర్‌‌‌‌కు ఏపీలోని 205 ఎకరాల క్యాచ్‌‌మెంట్​ఏరియా ద్వారా వరద వస్తుందని తెలిపారు. 43.50 మీటర్ల వద్ద కొత్తకాలనీకి వర్షాలు, డ్రెయిన్​ వాటర్‌‌‌‌తో 70 ఎకరాల క్యాచ్‌‌మెంట్​ఏరియా ఉంటుందన్నారు. భద్రాచలం గుడితో పాటు టౌన్‌‌లో నది ప్రవాహ ఎత్తును బట్టి ముంపు తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. బూర్గంపాడు నుంచి దుమ్ముగూడెం ఆనకట్ట వరకు గోదావరి నదికి ఇరువైపులా 35 చిన్నాపెద్దా వాగులు కలుస్తాయని, బ్యాక్​ వాటర్​ప్రభావం వాటిపై కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వాటికి ఏపీ రక్షణ చర్యలు చేపట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తురుబాకు వాగు వల్ల రెండు రాష్ట్రాల్లో ఏర్పడే ముంపుపై ఏపీ సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏటపాక, ఏదుళ్ల వాగులతో పలు ఇండ్లు, స్కూళ్లు నీట మునుగుతాయన్నారు. పెద్దవాగు స్ట్రీమ్‌‌తో కొన్ని వ్యాపార సముదాయాలు మునిగే ప్రమాదం ఉందన్నారు. దోమలవాగుతో బూర్గంపాడులోని బయో ఎలక్ట్రికల్​ప్లాంట్​మునుగుతుందని, దీనిపైనా ఏపీ ఇప్పటివరకు ఎఫ్ఆర్‌‌‌‌ఎల్ వివరాలను సమర్పించలేదని పేర్కొన్నారు. బ్యాక్​వాటర్‌‌‌‌తో కిన్నెరసాని ఉప్పొంగి నవభారత్, కేటీపీఎస్​ ఇండస్ట్రియల్ ​పంపింగ్ ​స్టేషన్లు మునుగుతాయన్నారు. అయితే, ఏపీ దీనికి సంబంధించి గోదావరి నదిలో కిన్నెరసాని కలిసే పాయింట్‌‌ను తప్పుగా చూపించిందని, మరోసారి సర్వే చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. 

ఎన్జీటీ ఆదేశాలను పాటించాల్సిందే..

పోలవరం ముంపు ప్రభావంపై 2019లోఎన్జీటీ ​ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని స్టోర్​చేస్తే.. కిన్నెరసాని నది, స్థానిక వాగులపై పడే ప్రభావం, దానితో కలిగే ముంపుపై ఏపీ చర్యలు చేపట్టాల్సిందేనని ఎన్జీటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుతో కలిగే దుష్ప్రభావాలపై పీపీఏ, ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఎన్జీటీ చెప్పిందని పేర్కొన్నారు. ముంపుపై తెలంగాణ, చత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదింపులు చేసుకోవాలని.. ముంపుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిందన్నారు.

జీబీ లింక్‌‌ను ఆపండి..

పోలవరం ప్రాజెక్ట్​ ఆధారంగా ఏపీ చేపడుతున్న గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్టును ఆపాలని పీపీఏను అధికారులు కోరారు. ఈ ప్రాజెక్టు గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధమని పేర్కొన్నారు. తాడిపూడి లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీమ్‌‌ను ఏపీ తాత్కాలిక పద్ధతిలో చేపట్టిందని, ఇప్పుడు జీబీ లింక్​ ద్వారా దాన్ని శాశ్వత ప్రాజెక్టుగా మారుస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దశలవారీగా పోలవరం కుడి కాల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నదని, 1978లో 10 వేల క్యూసెక్కులతో డిజైన్​ చేసిన కాల్వను.. ఇప్పుడు 40 వేల క్యూసెక్కులకు పెంచే ప్రయత్నాలు చేస్తున్నదని ఆక్షేపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టును ఆపాల్సిందేనని తేల్చి చెప్పారు.