అమెరికాపై సైబర్ అటాక్స్..

ట్రంప్ సైలెంట్.. ఇక బైడెన్​దే బాధ్యత!

కీలక గవర్నమెంట్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌లు హ్యాక్
రష్యా నుంచే అటాక్స్ జరిగినట్లుగా అనుమానాలు
రివేంజ్ తప్పదని బైడెన్ వార్నింగ్

వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ సంస్థలు, కీలక కంపెనీలపై కొన్ని నెలలుగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయా? ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైతం గుర్తించలేని స్థాయిలో ప్రారంభమైన సైబర్ అటాక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? అమెరికన్ మీడియా, కంపెనీలు అవుననే చెప్తున్నాయి. అయితే సైబర్ అటాక్స్ వెనక రష్యా హస్తం ఉందన్న అనుమానాలు వస్తుండగా.. ఇప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. సైబర్ అటాక్స్ పై ఆయన అఫీషియల్ గా ఎలాంటి చర్యలకూ సిద్ధం కాలేదని నిపుణులు చెప్తున్నారు. బుధవారం ట్రంప్ కేబినెట్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించినా, సైబర్ అటాక్స్ బారిన పడిన డిఫెన్స్, విదేశాంగ శాఖ, న్యాయ శాఖ వంటి కీలక శాఖల మంత్రులు అటెండ్ కాలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సైబర్ అటాక్స్ గురించి ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో సైబర్ అటాక్స్ విషయంలో ప్రతీకార చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఇక కాబోయే ప్రెసిడెంట్ జో బైడెన్ పైనే పడిందని అంటున్నారు. దాదాపు 9 నెలల కిందటే మొదలైన ఈ సైబర్ దాడుల సంగతి ట్రంప్ సర్కార్ దిగిపోయే టైంలో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో న్యాయపోరాటంపైనే ఫోకస్ పెట్టిన ట్రంప్ కరోనా కంట్రోల్ చర్యలనూ గాలికొదిలేశారని, ఇప్పుడు సైబర్ అటాక్స్ నూ పట్టించుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16 ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేందుకు వీలుగా ఎలక్షన్ ను ప్రభావితం చేసేందుకు రష్యా సైబర్ అటాక్స్ తో సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా ట్రంప్ సైలెంట్ గానే ఉండిపోయారు.

సైబర్ అటాక్స్ వీటిపైనే.. 

తమ సిస్టమ్స్ ను ఎవరో హ్యాక్ చేశారని, తమ క్లయింట్లకు చెందిన సాఫ్ట్ వేర్ లూ హ్యాక్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫైర్ఐ’ గతవారం వెల్లడించింది. ఈ కంపెనీ క్లయింట్లలో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ కూడా ఉండటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఫెడరల్ గవర్నమెంట్ కు, కొన్ని కార్పొరేషన్లకు సాఫ్ట్ వేర్ సేవలు అందించే ‘సోలార్ విండ్స్’ కంపెనీ కూడా తాము హ్యాకర్ల బారిన పడినట్లు ప్రకటించింది. యూఎస్ గవర్నమెంట్ లో అతి కీలకమైన ట్రెజరీ, కామర్స్, హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్లతో సహా అనేక ఏజెన్సీలు, కంపెనీలలోకి హ్యాకర్లు చొరబడి ఉండొచ్చని వెల్లడించింది. దీంతో అమెరికా గవర్నమెంట్ కు తీవ్ర ముప్పును కలిగించే స్థాయిలో అటాక్స్ జరిగాయని భావిస్తున్నారు.

ఎఫ్‌‌బీఐ దర్యాప్తు షురూ..

ఇంటెలిజెన్స్ డేటాతో పాటు ఇతర అన్ని రకాల సమాచారం ఆధారంగా సైబర్ అటాక్స్ పై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌‌బీఐ వెల్లడించింది. అటాక్స్ కు గురయ్యే ప్రమాదం ఉన్న సంస్థలతోనూ టచ్ లో ఉన్నట్లు తెలిపింది. సైబర్ అటాక్స్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఎఫ్‌‌బీఐ, సీఐఎస్ఏ, ఓడీఎన్ఐ సంస్థలు జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశాయి. ఇందుకోసం ‘సైబర్ యూనిఫైడ్ కోఆర్డినేషన్ గ్రూప్ (యూసీజీ)’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి.

మూల్యం చెల్లించుకోక తప్పదు: బైడెన్

అమెరికాపై సైబర్ అటాక్స్ కు పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాబోయే ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. అమెరికా ఫెడరల్, స్టేట్, లోకల్, ట్రైబల్, టెరిటోరియల్ గవర్నమెంట్లు, కీలక ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు తీవ్రమైన సైబర్ అటాక్స్ ముప్పు పొంచి ఉందని గురువారం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ హెచ్చరించిన కొన్ని గంటలకే బైడెన్ మాట్లాడారు. అమెరికాపై దాడులు చేస్తే ఊరుకోమన్నారు.

For More News..

కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్

కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌