సైబర్ మోసం: రూ.లక్ష ఇచ్చి డ్యూటీలో జాయిన్ కండి.. మెరిట్ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఫోన్లు

గద్వాల, వెలుగు: ‘కంగ్రాట్స్..​ మీరు స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయ్యారు! వెంటనే మీరు ఫోన్ పే లేదంటే గూగుల్ పే ద్వారా రూ.లక్ష, రూ.60 వేలు జమ చేయండి. మీరు చాలా అదృష్టవంతులు ఎంత మందో కాళ్లు మొక్కుతున్నా, వారికి రాని జాబ్​ మీకు ఇస్తున్నాం’ అంటూ రెండు రోజుల నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని స్టాఫ్ నర్స్  పోస్ట్  కోసం అప్లై చేసుకొని మెరిట్  లిస్టులో ఉన్న వారికి ఫోన్లు వస్తున్నాయి. 

జిల్లాలో 17 స్టాఫ్​ నర్సు పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్  జారీ చేశారు. 400 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. స్క్రూటీని చేసి మెరిట్  లిస్టును హెల్త్  డిపార్ట్​మెంట్  వారు ఫోన్  నెంబర్లు, అడ్రస్ తో సహా ఆన్ లైన్ లో పెట్టారు. దీంతో వారందరికీ ఫోన్లు చేసి డబ్బులు పంపించాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే జాబ్​ రాదని చెబుతున్నారు. దీంతో అప్లై చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ఇన్​చార్జి డీఎంహెచ్​వో సిద్దప్పను వివరణ కోరగా, స్టాఫ్  నర్స్  పోస్టుల భర్తీ కోసం వైద్య శాఖ నుంచి ఎవరూ ఫోన్  చేయడం లేదన్నారు.

సైబర్  నేరగాళ్లు డబ్బులు వసూలు చేసేందుకు ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరూ డబ్బులు జమ చేయవద్దని సూచించారు. సైబర్  క్రైమ్ లో కంప్లైంట్  చేయాలని సూచించారు. దరఖాస్తులను వెరిఫై చేసి స్క్రూటినీ చేశామని, త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఎవరి మాటలు నమ్మవద్దని సూచించారు.