ఎఫ్​బీ ఫ్రెండ్​షిప్ పేరిట మోసం..లక్షన్నర కొట్టేసిన సైబర్ చీటర్స్

ఎఫ్​బీ ఫ్రెండ్​షిప్ పేరిట మోసం..లక్షన్నర కొట్టేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్​లో ఫ్రెండ్​షిప్ పేరిట ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. సికింద్రాబాద్ కు చెందిన 34 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగికి తొలుత ఫేస్ బుక్ లో యూఎస్​లో సర్జన్​గా పని చేస్తున్న హరీ రాబర్ట్ పేరిట రెండు నెలల కింద ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని యాక్సెప్ట్ చేసిన బాధితుడితో కొద్దిరోజులు స్కామర్లు చాట్ చేశారు. అనంతరం వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసి, త్వరలో ఇండియా వస్తున్నానని, వచ్చాక కలుద్దామని ఎర వేశారు.

బాధితుడిని నమ్మించేందుకు యూఎస్ నుంచి ముంబైకు బుక్ అయినట్లు ఫ్లైట్ టికెట్ ఫొటోస్ ను పంపించారు. తరువాత తాను ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యానని.. కానీ, తన వద్ద ఉన్న 1,20,000 యూఎస్ డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని బాధితుడిని నమ్మించారు. తనకు సహాయం చేయాలని కోరారు. ముంబై ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారుల పేరుతో స్కామర్స్ ఫోన్ కాల్ చేసి , అతని స్నేహితుడు ఇల్లీగల్ గా డాలర్లు తీసుకువచ్చారని , అతనితో పాటు అతనితో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయాల్సి వస్తుందని బెదిరించారు.

దీంతో బాధితుడు తన స్నేహితులు,  బంధువుల నుంచి డబ్బులు తీసుకొని మొత్తం రూ. 1,55,000 లను స్కామర్స్ కు బదిలీ చేశాడు. మరింత డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు..సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్​లో ఫిర్యాదు చేశారు.