
బషీర్‌బాగ్, వెలుగు: కస్టమర్‌కేర్ ప్రతినిధి పేరిట రిటైర్డ్ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఉన్న గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ (ఏసీ) రిపేర్‌కు రావడంతో బాధితుడు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్ లో సర్చ్ చేశాడు. అయితే, స్కామర్స్ పెట్టిన మొబైల్ నంబర్‌కు వృద్ధుడు కాల్ చేశాడు.
అనంతరం స్కామర్లు వృద్ధుడికి ఓ లింక్‌ను పంపించగా, అందులో వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను నమోదు చేశాడు. వెంటనే అకౌంట్ ను నిర్ధారించడానికి రూ.10 చెల్లించాలని కోరారు. అనుమానం వచ్చిన బాధితుడు కాల్ ను డిస్కనెక్ట్ చేశాడు. మరుసటి రోజు అకౌంట్ బ్యాలెన్స్ చూడగా, అతని సెంట్రల్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1,90,000 డెబిట్ అయినట్లు గుర్తించాడు. న్యాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.