- అమాయకుల ఆశని క్యాష్ చేసుకుంటున్నరు
- ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్‌లో సైబర్ చీటర్స్
‘‘మెహిదీపట్నానికి చెందిన ఆసిఫ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెలలో ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరులో అతడికి ఓ మెసేజ్ వచ్చింది. తమ వద్ద ట్రేడింగ్ చేస్తే గంట గంటకు లాభాలు చూస్తారని చెప్పారు. ఆ తర్వాత టెలిగ్రామ్ లో లింక్ పంపించారు. మొదటిసారి రూ.500 ఇన్వెస్ట్ చేయించి, రూ.300 అదనంగా మొత్తం రూ.800 అకౌంట్‌లో డిపాజిట్ అయినట్లు చూపారు. ఇలా మొదలుపెట్టి విడతల వారిగా అతడి నుంచి రూ.2 లక్షల 23 వేలు ఇన్వెస్ట్చేయించారు. అయితే, డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలులేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’’
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాల ఆశ చూపి అందినకాడికి దోచుకుంటున్నారు. ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్ ఉద్యోగులను టార్గెట్ చేసి కోట్లు కొట్టేస్తున్నారు. గతంలో ఫేస్‌బుక్, వాట్సప్ అడ్డాగా జరిగిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ప్రస్తుతం టెలిగ్రామ్ వేదికగా చేస్తున్నారు. ప్రొఫెషనల్ ఉద్యోగులు చాలా మంది టెలిగ్రామ్ వాడుతుండటంతో వారిని ట్రాప్‌చేసి దోచుకుంటున్నారు. విద్యావంతులైనా సరే ఈజీ మనీ ఆశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాదిలో సైబర్‌నేరగాళ్లు రూ.43 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి కేసులు138 నమోదయ్యాయి.
వర్చువల్ అకౌంట్స్‌తో పోలీసులకు సవాళ్లు
సైబర్ మోసాలు రోజురోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్లు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఫేక్ ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్‌తో వరుస మోసాలకు పాల్పడుతున్నారు. గేమింగ్ యాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ లాంటి మోసాలకు ఆన్‌లైన్‌లో వర్చువల్ అకౌంట్స్‌ను వినియోగిస్తున్నారు. వాటితో ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేసినట్లుగా అమౌంట్ కనిపిస్తుందే కానీ, విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు. దీన్నే సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి అకౌంట్స్‌ను వినియోగించిన వారిని ట్రేస్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
మోసపోతున్న విద్యావంతులు
సాప్ట్‌వేర్, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజనీరింగ్, పీజీ స్టూడెంట్స్ సహా గృహిణలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పార్ట్‌టైమ్ జామ్, ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ పేరుతో సోషల్ మీడియాలో బల్క్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టెలిగ్రామ్ అడ్డాగా సైబర్ దోపిడీ పెరిగిపోయింది. గతంలో వాట్సాప్ లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరగ్గా.. గ్రూప్ యూజర్స్ అలర్ట్ కావడంతో ప్రస్తుతం సైబర్ చీటర్స్ తమ దృష్టిని టెలిగ్రామ్ వైపు మళ్లించారు. ఈ యూజర్స్‌ను ఈజీగా కాంటాక్ట్ అయ్యే అవకాశాలుండటంతో గ్రూప్స్ ఏర్పాటు చేసి, వాటిలో ఎక్కువ మందిని చేర్చుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్, టాస్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లింక్స్ పంపిస్తున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో రూ.200 నుంచి మొదలుకొని లక్షల్లో పెట్టుబడులు పెట్టించి, వర్చువల్ అకౌంట్స్‌లో బ్యాలెన్స్ చూపిస్తున్నారు. చివరకు బాధితుల ఫోన్ నంబర్ల బ్లాక్ చేస్తున్నారు.
కంప్లైంట్ చేసేందుకు ముందుకురాని బాధితులు
రాష్ట్ర వ్యాప్తంగా పోల్చితే గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.సైబర్ క్రైం పోలీసులకు ప్రతి రోజూ ఐదుకు పైగానే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరిగిన 138 సైబర్ క్రైమ్ కేసులను పోలీసులు రిజిస్టర్ చేశారు. ఇందులో సుమారు రూ.43 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. భయం, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ మొత్తంలో డబ్బు కోల్పోయినవారు కంప్లైంట్చేసేందుకు ముందుకు రావడంలేదని పోలీసులు గుర్తించారు. భారీగా డబ్బు కోల్పోయిన బాధితులు మాత్రమే కంప్లైంట్స్ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు.
లింకులు క్లిక్చేయొద్దు
టెలిగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయొద్దు. ఎలాంటి లింక్స్ పంపినా క్లిక్ చేయకూడదు. పార్ట్‌టైమ్ జాబ్, టాస్క్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి మెసేజ్‌లను నమ్మకూడదు. ఎలాంటి నేరం జరిగినా వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
–కెవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్