ఐఫోన్​కు ఆశపడితే.. బ్యాంక్ ఎక్కౌంట్ ఖాళీ..

ఐఫోన్​కు ఆశపడితే.. బ్యాంక్ ఎక్కౌంట్ ఖాళీ..
  •  మహిళా ఉద్యోగిని మోసం చేసిన సైబర్ చీటర్స్

బషీర్ బాగ్, వెలుగు: ఐ ఫోన్ గెలుచుకున్నారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. తొలుత సిటీకి చెందిన 25 ఏండ్ల మహిళా ఉద్యోగి ఇన్​స్టాగ్రామ్ ద్వారా రూ.2 వేల కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ బుక్ చేసింది. ఆ మరుసటి రోజు స్కామర్స్ ఆమెకు ఫోన్ చేసి ఆన్​లైన్​లో తమ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసినందుకు ఐ ఫోన్ గెలుచుకున్నట్లు తెలిపారు. ఐ ఫోన్​ను పొందాలంటే మరో రూ.3 వేల ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం వాట్సాప్​కు ఓ లింక్​ను పంపించి, దాంట్లో షాపింగ్ చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన మహిళ ఆ లింక్ ఓపెన్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టింది.​ ఈ ప్రాసెస్​లో ఓటీపీ నమోదు చేయడంతో ఆమె అకౌంట్లోని మొత్తం రూ 1,47,967 డెబిట్ కావడంతో షాకైంది.  దీంతో మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.