ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. జిల్లాలో సగటున రెండు రోజులకో సైబర్ క్రైం నమోదవుతోంది. 2021 కంటే 2022లో ఆన్​లైన్ మోసాలు రెట్టింపు అయ్యాయి. మోసపోతున్న వారిలో  విద్యావంతులతో పాటు నిరక్ష్యరాస్యులు కూడా ఉన్నారు. బ్యాంక్‌‌, ఇతరత్రా అన్ని వ్యవహారాల కోసం అన్​లైన్ వ్యవస్థ పెరగడం, చిన్న పాటి పొరపాటుతో కొందరు, అవతలి వ్యక్తులు చెప్పే మాటలు నిజమని నమ్మి మరి కొందరు   మోసపోతున్నారు.

పరిస్థితి ఇది..

2021 కంటే 2022లో సైబర్ క్రైంలు పెరిగాయి. తెలి యని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌‌లు, ఫోన్లకు రెస్పాండ్‌‌ కావద్దని, వారికి వివరాలు చెప్పవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ మోసాలు మాత్రం ఆగడం లేదు. 2021లో 257 పిటిషన్లు వస్తే 115 ఎఫ్ఐఆర్​ చేశారు. రూ.59,97,449 డబ్బులు నష్టపోతే నిందితులను నుంచి రూ.2,68,118 సొమ్ము రికవరీ చేశారు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు 562 ఫిర్యాదులు వస్తే ఇందులో  277 ఎఫ్ఐఆర్ అయ్యాయి. మొత్తం రూ.2,29,76,267 సొమ్మును గుర్తు తెలియని వ్యక్తులు ఆన్​లైన్‌‌ కొల్లగొట్టారు. ఇందులో రూ.41,85,655 మాత్రమే రికవరీ అయ్యింది. రెండేళ్ల వ్యవధిలో జిల్లాలో నిత్యం ఏదో ఓ చోట సైబర్ క్రైం వెలుగు చూస్తోంది. బాధితులు అలస్యంగా ఫిర్యాదు చేయడం, సరైన వివరాలు చెప్పకపోవడంతో మోసానికి పాల్పడిన వ్యక్తుల సమాచారం దొరకడం లేదని పోలీసులు చె
బుతున్నారు. ఆన్​లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం కూడా సమస్యగా మారింది.  

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన నిఖిల్​గౌడ్‌‌కు ఈనెల 18న ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఓ మెసేజ్ వచ్చింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ మెస్సేజ్ ద్వారా నమ్మించారు. అవతలి వ్యక్తులు చెప్పిన ప్రకారం విడతల వారీగా అకౌంట్‌‌లో పైసలు వేశాడు. ఐదు రోజుల వ్యవధిలోనే రూ.1,12,397 పంపాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తుల నుంచి రిప్లై రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కామారెడ్డి టౌన్‌‌కు చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్ నుంచి మాట్లాడుతు న్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​చేశారు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన పాస్​వర్డ్‌‌ మార్చుకోవాల్సిఉందని, ఫోన్‌‌కు వచ్చే ఓటీపీ నంబర్ చెబితే మారుస్తామని చెప్పారు. నిజమని నమ్మిన సదరు వ్యక్తి తన ఫోన్‌‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌‌‌‌ చెప్పారు. కొద్ది సేపట్లోనే తన అకౌంట్‌‌లో నుంచి రూ.55 వేలు కట్‌‌ అయింది. బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

జాగ్రత్తగా ఉండాలి

ఆన్‌‌లైన్ మోసాలపై పోలీసు శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ జనం గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్‌‌, క్రెడిట్ కార్డుల వివరాలు చెబుతున్నారు. సైబర్ క్రైం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌కు ఫోన్ చేయాలి. కానీ చాలా మంది అలస్యంగా సమాచారం ఇస్తున్నారు. దీంతో  నిందితులు దొరకడం కష్టమవుతోంది. ఆన్‌‌లైన్ మోసాలు, టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌పై ప్రజలకు ఇంకా అవగాహన  కల్పించే ప్రోగ్రామ్‌‌లు చేపడుతాం. 
–బి.శ్రీనివాస్‌‌రెడ్డి, ఎస్పీ కామారెడ్డి 

కేసీఆర్‌‌‌‌ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుండు

  • మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌‌‌‌రెడ్డి 

కామారెడ్డి, వెలుగు: రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసే సీఎం కేసీఆర్‌‌‌‌ను తరిమికొడతామని బీజేపీ నేత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌‌‌‌రెడ్డి అన్నారు. ఇండస్ట్రీస్ పేరిట రైతులను రోడ్డు పాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌‌తో నష్టపోతున్న బాధిత రైతులతో ఆదివారం సదాశివనగర్​ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో మీటింగ్ నిర్వహించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌‌లో విలువైన భూములను ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లలో ప్రతిపాదించా రని రైతులు తెలిపారు. అనంరతరం రవీందర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తన నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలన్నారు. గవర్నమెంట్​ స్పందించి వెంటనే ఇండస్ట్రియల్​ జోన్‌‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మాస్టర్​ప్లాన్‌‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సురేందర్​ హామీలు ఇవ్వడం కాదు.. మాస్టర్​ ప్లాన్‌‌ను ఆపి తన చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. పార్టీ ప్రెసిడెంట్ నర్సింహ్మా రెడ్డి, రూపేందర్‌‌‌‌, విఠల్‌‌రెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.  

రైతుల అప్పులు రద్దు చేయాలి

  • ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్

ఆర్మూర్, వెలుగు: రైతులకున్న అన్ని రకాల అప్పులు రద్దు చేయాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులో భాగంగా కనీసం మద్దతు ధర గ్యారంటీ చట్టం అమలు చేయాలని, 60 సంవత్సరాలు వయసున్న ప్రతి రైతుకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరల్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 27న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు బి.దేవారం, రైతు జేఏసీ నాయకులు దెగాం యాదాగౌడ్, లింగారెడ్డి, ఆకుల గంగారం, ఆకుల నరేశ్‌‌, మంథని గంగన్న పాల్గొన్నారు.

పడిపూజలో పాల్గొన్న మాజీ మంత్రి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి అయ్యప్ప టెంపులో ఆదివారం జరిగిన పడిపూజలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ పాల్గొన్నారు.శబరిమల వెళ్లేందుకు గవర్నమెంట్​ ప్రత్యేక వసతులు, ఫ్రీ బస్సు సర్వీస్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌‌రావు, ప్రతినిధులు వలిపిశెట్టి భాస్కర్, ఉదయ్, శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్‌‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

ఇందూరులో శ్రద్ధానంద విగ్రహావిష్కరణ

నిజామాబాద్ టౌన్, వెలుగు: సౌత్ ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా ఇందూరులో స్వామి శ్రద్ధానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 96వ శ్రద్ధా నంద బలిదాన దినం సందర్భంగా ఆదివారం స్థానిక కొత్త గంజ్‌‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సార్వ దేశిక్ ప్రతినిధి సభ ఢిల్లీ అధ్యక్షుడు స్వామి ఆర్యవేశ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ ఢిల్లీ మహామంత్రి విఠల్‌‌రావు ఆర్య, మున్సిపల్ నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా,15వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, ఆర్య సమాజ్ ఇందూర్ అధ్యక్షులు రామలింగం, మహామంత్రి మాంకాల విజయకుమార్, పురోహితులు వేదమిత్ర తదితరులు పాల్గొన్నారు.