ములుగు, వెలుగు : ఆన్‌లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బులను ములుగు పోలీసులు 48 గంటల్లో రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ములుగు మండలం కాశిందేవిపేటకు చెందిన గుంటి శ్రీకాంత్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన సిమ్ పాడైపోవడంతో కొత్త సిమ్ తీసుకున్న శ్రీకాంత్ రెండు రోజుల క్రితం కాశిందేవిపేటకు వచ్చాడు. సిమ్ యాక్టివేట్ కాకపోవడంతో ములుగులోని స్టోర్‌కి వెళ్లి యాక్టివేట్ చేయించుకున్నాడు.
కొద్దిసేపటికే తన అకౌంట్ నుంచి రూ.99,999లు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వివరాలు చెక్ చేయగా హీరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలియడంతో ములుగు ఎస్సై పవన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సైబర్ క్రైం టీంకు బదిలీ చేశారు. దీంతో వారు శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించడంతో పాటు, డబ్బులు ఎలా పోయాయో తెలుసుకొని, వాటిని 48 గంటల్లో రికవరీ చేశారు. ఈ డబ్బులను గురువారం ఎస్పీ గాష్ ఆలం శ్రీకాంత్‌కు అప్పగించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైం కానిస్టేబుల్ జహుర్, రహీం పాల్గొన్నారు.