హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ చీటింగ్ కేసులు భారీగా నమోదయ్యాయి. గతేడా తో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 25.84 శాతం, చీటింగ్ కేసులు15 శాతం ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి. అయితే, ఓవరాల్ క్రైమ్ రేట్ మాత్రం12 శాతం తగ్గింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసులకు సంబంధించిన యాన్యువల్ రిపోర్టును సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో రిలీజ్ చేశారు. మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది30,954 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 27,322 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రాపర్టీ క్రైమ్స్ 28 శాతం తగ్గా యని తెలిపారు. ఇక సైబరాబాద్ పరిధిలో 27 లక్షల ట్రాఫిక్ చలాన్లు విధించామని, మొత్తం రూ. 121 కోట్ల ఫైన్లు వేశామని తెలిపారు. 2021తో పోలిస్తే ఈ ఏడాది ట్రాఫిక్ చలాన్లు భారీగా తగ్గాయన్నారు.
పకడ్బందీగా భద్రత
సైబరాబాద్ పరిధి ఐటీ కారిడార్‌లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ముచ్చింతల్‌లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు, ప్రధాని మోడీ టూర్ సందర్భంగా ఎలాంటి ఘటనలకు తావులేకుండా బందోబస్తు నిర్వహించామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ అధీనంలో ఉన్నందున ఆ వివరాలను వెల్లడించలేమన్నారు. కమిషరేట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ(టీఎస్‌పీసీసీ) ద్వారా సైబర్ నేరాలను నియంత్రిస్తామని వివరించారు. సమావేశంలో డీసీపీలు కల్మేశ్వర్, శ్రీనివాస్‌రావు, శిల్పవల్లి, జగదీశ్వర్‌రెడ్డి, సందీప్, ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ కవిత పాల్గొన్నారు.