- సైబర్ ముఠాకు బ్యాంకు అకౌంట్లు అందించిన వ్యక్తి అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: సైబర్ ముఠాకు బ్యాంక్ అకౌంట్లు అందించే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా వచ్చి పాలసీలు చేసి చార్జీల కింద రూ.45.78 లక్షలు తీసుకుని మోసగించారని రిటైర్డ్ ఎంప్లాయ్ షబ్నం భక్షి(72) ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు అందించే రాజస్థాన్‌కి చెందిన తరుణ్ సచ్‌దేవ్ ను అరెస్ట్ చేశారు.
ముందుగా డైరెక్టరీల(డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వంటివారివి) నుంచి డేటాను సైబర్ ముఠా డౌన్ లోడ్ చేసుకునేది. ఆ డేటాను ఢిల్లీకి చెందిన కాల్ సెంటర్ 'హెచ్‌డబ్ల్యూ అవుట్ సోర్సింగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెలికాలర్లకు అందించేది. బీమా పాలసీ కోసం కాల్ చేసి వ్యక్తిగత వివరాలను సేకరించేది. దీంతో ఢిల్లీకి చెందిన సైబర్ ముఠాలోని సత్పాల్ సింగ్, అభిషేక్, ఆశిష్ ముఠా మోసాలకు పాల్పడేది. వచ్చిన డబ్బును బ్యాంక్ అకౌంట్లలో వేసేవారు. సైబర్ ముఠాకు బ్యాంక్ అకౌంట్లు అందించిన సచ్దేవ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద చెక్ బుక్, బ్యాంకు పాస్ బుక్స్ 2, మొబైల్ ను స్వాధీనం చేసుకున్నట్టు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు.
ఆన్ లైన్ జాబ్ ఇస్తమని..
ఘట్ కేసర్, వెలుగు: ఆన్ లైన్ జాబ్ పేరిట విద్యార్థిని మోసపోయింది. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మీనరసింహస్వామి కాలనీకి చెందిన విద్యార్థిని(20) సెల్ ఫోన్ కు ఈనెల 13న ఓ మెసేజ్ వచ్చింది. మంచి శాలరీతో ఆన్ లైన్ జాబ్ ఇస్తామని అందులో ఉండగా.. మెసేజ్ లింక్ ను క్లిక్ చేసింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ప్రముఖ సంస్థలో జాబ్ వచ్చిందని, ఆమె మొబైల్ కు వచ్చిన ఓటీపీని చెప్పాలని తెలిపాడు.
దీంతో ఓటీపీ చెప్పగా.. మరుసటి రోజు ఆమె బ్యాంక్ ఖాతాలోని నగదు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. జాబ్ ఇస్తామని చెప్పిన వ్యక్తికి విద్యార్థిని ఫోన్ చేసి మాట్లాడగా.. డబ్బులు తిరిగి రావాలంటే మరికొంత నగదు పంపాలని సూచించాడు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు మంగళవారం కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.