- పెట్టుబడి పెట్టించి.. పెద్దమొత్తంలో లాభాలు చూపించారు
- తీరా బాధితుడు డబ్బులు విత్‌డ్రా చేయాలని చూస్తే ప్లేట్ తిప్పేశారు
- ముఠా సభ్యుల్లో ఇద్దరి అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట సాఫ్ట్వేర్ఉద్యోగి నుంచి రూ.2.29 కోట్లు కొట్టేసిన ముఠాలోని ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తొలుత స్టాక్ మార్కెట్ట్రేడింగ్, స్కిల్ బిల్డింగ్‌పై దృష్టి సారించడం కోసం ‘బీ2231 కేఎస్ఎల్అఫీషియల్స్టాక్’ అనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయ్యాడు. ఈ గ్రూపును లీడ్ చేస్తున్న నారాయణ్ జిందాల్, అంజలితో పాటు మరికొంత మంది తాము సూచించిన విధంగా పెట్టుబడి పెట్టి, మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు.
అనంతరం బాధితుడితో ‘కోటాక్ప్రో’ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేయించి, రూ.2.29 కోట్లు పెట్టుబడి పెట్టించారు. అనంతరం పెద్దమొత్తంలో లాభాలు వచ్చినట్లు ఆన్లైన్లో చూపించారు. అయితే, బాధితుడు ఆ డబ్బులను విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, సాధ్యపడలేదు. డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ట్యాక్స్‌లు కట్టాలన్నారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అక్టోబర్8న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహరాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన నరేశ్ షిండే, సౌరభ్ షిండేను బుధవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన నారాయణ్ జిందాల్, అంజలికి వీరు బ్యాంక్ అకౌంట్లను కమీషన్పద్ధతిలో అందజేస్తున్నట్లు గుర్తించారు. సౌరభ్ షిండే అకౌంట్‌కు బాధితుడి అకౌంట్ నుంచి రూ.50 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు చెప్పారు. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.