వాట్సాప్​ స్క్రీన్​ షేర్​ చేయించుకుని.. ఓటీపీలతో రూ.2.50 లక్షలు ఊడ్చేశారు!

వాట్సాప్​ స్క్రీన్​ షేర్​ చేయించుకుని.. ఓటీపీలతో రూ.2.50 లక్షలు ఊడ్చేశారు!
  •     రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని చీట్​చేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్, వెలుగు: కరెంట్ బిల్లు పేమెంట్ కోసం గూగుల్​లో సర్చ్​చేసిన రిటైర్డ్​ప్రభుత్వ ఉద్యోగిని టార్గెట్​చేసి సైబర్​నేరగాళ్లు రూ.2.50 లక్షలు కొట్టేశారు. బాధితుడి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేశారు. సిటీకి చెందిన రిటైర్డ్​ప్రభుత్వ ఉద్యోగి(77) మార్చి నెలకు సంబంధించిన కరెంట్​బిల్లును ఇటీవల ఆన్​లైన్​ద్వారా పే చేశాడు. 

బ్యాంక్​అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినప్పటికీ పేమెంట్ సక్సెస్​అయినట్లు చూపించలేదు. బిల్లు పెండింగ్ ఉన్నట్లు చూపడంతో, ఎక్కడ కరెంట్ సప్లయ్​కట్​చేస్తారోననే భయంతో మరోసారి పేమెంట్ చేశాడు. తర్వాత గూగుల్ లో బిల్ డెస్క్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సర్చ్​చేశాడు. అందులోని నంబర్​కు కాల్​చేసి పేమెంట్​సమస్యను వివరించాడు. తర్వాత వృద్ధుడికి వాట్సాప్​కాల్​వచ్చింది. సమస్యను పరిష్కరించేందుకు బ్యాంక్​అకౌంట్​నంబర్, ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరగా వృద్ధుడు అన్నీ చెప్పాడు. 

తర్వాత మొబైల్ స్క్రీన్ షేర్ చేయమని కోరగా వృద్ధుడు షేర్​చేశాడు. తర్వాత వరుసగా ఓటీపీలు వచ్చాయి. క్షణాల్లో వృద్ధుడి మూడు బ్యాంక్​అకౌంట్లలోని రూ.2,49,896 కట్ అయ్యాయి. కొద్దిసేపటికి తేరుకున్న వృద్ధుడు తాను సైబర్​నేరగాళ్ల వలలో పడ్డానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.