Cyber crime: సైబర్ వలలో సిటీ జనం.. రోజూ కంప్లయింట్సే 50.. బయటకు రానివి ఇంకెన్నో

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త స్కీములతో ఆశలు చూపించి అమాయక ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. దీంతో భాదితుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుపోతుంది. లేటెస్ట్ టెక్నాలజీ వాడకంతో సైబర్‌ నేరగాళ్ల పని కూడా చాలా సులువుగా మారింది. కోణాల్లో అమాయకుల ఖాతాల నుండి లక్షల్లో డబ్బు మాయం చేస్తున్నారు.

కేవలం సైబర్‌ నేరాలకు సంబంధించి గ్రేటర్‌లోని ట్రై పోలీస్‌ కమిషనరేట్స్‌ పరిధిలో రోజుకు 40-50 ఫిర్యాదులు అందుతున్నాయని సమాచారం. ఒక్కో బాధితుడు రూ. లక్ష నుంచి రూ.25 లక్షల వరకు పోగొట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బు క్షణాల్లో మాయం అవడంతో భాదితులు లబోధిబో అంటున్నారు. పోలిసులకు కూడా సైబర్ నేరాలు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఆన్‌లైన్‌ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు కేటుగాళ్లు.

ఇల్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి నెల రోజులపాటు మకాం వేసి నిందితులను పట్టుకోవాల్సిన పరిస్థితి. ఈలోగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిలో కనీసం 5 శాతం కేసులను కూడా ఛేదించలేని పరిస్థితి నెలకొందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నేరాలను ఎలా కట్టడి చేయాలో తెలియాక తలలు పట్టుకుంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.