ఆన్‌‌లైన్‌‌ మోసాలను ఛేదించలేక పోలీసుల అవస్థలు

ఆన్‌‌లైన్‌‌ మోసాలను ఛేదించలేక పోలీసుల అవస్థలు
  • అప్‌‌డేట్ అయితలే.. ట్రైనింగ్ ఇస్తలే.. రోజుకో రీతిన కొత్త తరహా నేరాలు
  • పేరుకుపోతున్న సైబర్ క్రైమ్ కేసులు
  • హైదరాబాద్‌‌లోని మూడు కమిషనరేట్లలో పది వేల కేసులు 
  • అందులో 20 శాతం కూడా పరిష్కారం కాలే

హైదరాబాద్, వెలుగు: ఎంత పెద్ద దొంగతనమైనా, ఎక్కడ హత్య జరిగినా గంటల వ్యవధిలో పరిష్కరించే పోలీసులు.. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో మాత్రం ఫెయిలైతున్నారు. ఒకవైపు ఆన్‌‌లైన్‌‌ మోసాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండగా.. మరోవైపు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్ల పరిధిలో సైబర్ కేసులు భారీగా పేరుకుపోతున్నాయి. ఇతరత్రా నేరాలను వేగంగా పరిష్కరిస్తున్నా.. సైబర్ నేరాల విషయానికి వచ్చే సరికి సైలెంట్ అయిపోతున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో ఈ మధ్య వెల్లడైన ఇయర్ ఎండ్ క్రైమ్ రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇతరత్రా క్రైమ్‌‌లు కాస్త పెరగ్గా.. సైబర్ క్రైమ్స్ మాత్రం 70 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 66 శాతం ఎక్కువ నమోదయ్యాయి. ఇతరత్రా నేరాల పరిష్కారాల శాతం ఎక్కువగా ఉండగా.. సైబర్ క్రైమ్స్‌‌ విషయంలో ఇది దారుణంగా ఉంది. మూడు కమిషనరేట్లలో కలిపి పది వేల కేసుల వరకు నమోదు కాగా.. అందులో 20 శాతం కేసులు కూడా పరిష్కారం కాలేదు.

టెక్నాలజీ తెలియక ఇక్కట్లు

సాధారణ కేసుల విషయంలో సీసీ ఫుటేజీ, ఇతరత్రా ఆధారాలతో ఓ క్రోనాలజీ ప్రకారం దర్యాప్తు చేసి పోలీసులు వాటిని పరిష్కరిస్తున్నారు. కానీ సైబర్ నేరాల విషయంలో ఎటు నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్థితి. కంటికి కనిపించని, ఎక్కడున్నాడో తెలియని క్రిమినల్‌‌ను పట్టుకునేందుకు టెక్నాలజీ పరంగా పోలీసులకు అవగాహన ఉండటం లేదు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిన వల వేసి డబ్బు కొట్టేస్తున్నారు. వాటిని అరికట్టడం సంగతి దేవుడెరుగు.. కనీసం ఇప్పటిదాకా నమోదైన కేసులు కూడా ముందుకు కదలడం లేదు. 

ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే ట్రైనింగ్ ఇస్తుండటం, సైబర్ క్రైమ్ గురించి వాళ్లకు పెద్దగా తెలియకపోవడంతో కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. కొందరికి ట్రైనింగ్ ఇచ్చినా నామమాత్రంగానే ఉంటున్నది. ప్రతి పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఒకరికి చొప్పున సైబర్ క్రైమ్ విషయంలో శిక్షణ ఇవ్వాలని ఇటీవల నిర్ణయించినా అది ఆచరణ రూపం దాల్చలేదు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పటికీ మొదలవుతుందో తెలియదు. అది స్టార్టయ్యే లోపు సైబర్ నేరగాళ్లు అప్​డేట్ అయ్యి కొత్త రకం క్రైమ్‌‌ తీరుతో పోలీసులకు సవాళ్లు విసిరుతున్నారు. తమ అకౌంట్లలో డబ్బు మాయమై, ఇతరత్రా మోసాలకు గురై.. లబోదిబోమంటున్న వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటున్నది. రూ.ఐదు వేలు మొదలుకొని రూ.కోట్లను జనం ఆన్‌‌లైన్‌‌ మోసాల వల్ల కోల్పోతున్నారు.

వేలల్లో కేసులు.. అధికారులేరీ..?

సైబర్ నేరాల పరిష్కారం కోసం ప్రస్తుతం ప్రతి కమిషనరేట్ పరిధిలో ఒక సైబర్ సెల్ (పీఎస్​)ను ఏర్పాటు చేశారు. ఇందులో సైబర్ ఫ్రాడ్స్ గురించి అవగాహన ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, కొంత సిబ్బంది ఉంటున్నారు. అయితే కుప్పలు తెప్పలుగా వస్తున్న కేసుల్ని సాల్వ్ చేయడానికి వీళ్ల శక్తి సరిపోవడం లేదు. ప్రతి పీఎస్‌‌కి ముగ్గురు నలుగురు సిబ్బందిని సైబర్ కేసుల పరిష్కారం కోసం నియమించాలనుకున్నా.. అది సాధ్యం కావడం లేదు. ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇచ్చినా వాళ్లు తిరిగి డ్యూటీలోకి వచ్చే సరికి నేరాల రూపురేఖలు మారిపోతున్నాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తున్నది. కొత్త కొత్త పద్ధతుల్లో జరుగుతున్న సైబర్ క్రైమ్స్‌‌ను అరికట్టాలంటే మోడ్రన్ పరికరాలు, కొత్త సాఫ్ట్​వేర్లు, ఎథికల్ హ్యాకర్లు, ఇతర సైబర్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ ఆ మేరకు పూర్తి స్థాయిలో సమకూర్చుకున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సైబర్ నేరాల పరిష్కారంలో మన పోలీసులు బాగా వెనుకబడిపోతున్నారు.

ఆ పేర్లూ కొత్తే

డార్క్​నెట్, స్నూపింగ్, వర్చువల్ అకౌంట్స్, ఫిషింగ్ మెయిల్స్, వీసా ఫ్రాడ్స్, మ్యాట్రిమొనీ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ సహా రకరకాల మాల్‌‌వేర్ల ద్వారా జనాన్ని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ మోసాలు ఎలా చేస్తారో, వాటిని ఎలా అడ్డుకోవాలో  పోలీసులకు తెలియడం లేదు. చాలా మందికి ఈ పదాల గురించే తెలియదు. కొన్ని చోట్ల ఫిర్యాదు చేయడానికి వస్తే ఎలా నమోదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉండటం గమనార్హం.

ఏం చదువుకోకున్నా సైబర్ నేరాల్లో ఆరితేరుతున్నరు

సెవెన్త్, టెన్త్ పాస్ కాని వాళ్లు కూడా సైబర్ నేరాల్లో ఆరితేరుతున్నారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సిన సర్కారు దానిపై దృష్టి సారించడం లేదు. రిక్రూట్​మెంట్​లో కొత్త పద్ధతులు, సరికొత్త టెక్నాలజీలు తెలిసిన సిబ్బందిని నియమించు కోవాల్సిన పోలీసు శాఖ ఆ పని చేయడం లేదు.ఏదైనా అనూహ్యమైన కేసును అనివార్యంగా సాల్వ్ చేయాల్సి వచ్చినపుడు అప్పటికప్పుడు సైబర్ నిపుణులను సంప్రదించి తాత్కాలికంగా వాళ్లతో పని చేయించుకుంటున్న పరిస్థితి ఉంది.

అక్కడోళ్లు సహకరిస్తలే

ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడి పోలీసులు సహకరించడంలేదు. జ్యూరిస్‌డిక్షన్ సమస్యలు వస్తున్నాయి. ఈ ఏడాది రూ.66 కోట్లు సైబర్ ఫ్రాడ్స్‌ వల్ల పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. అందులో రూ.20 కోట్లు రికవర్ చేశాం. మరో రూ.8.5 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నోళ్లు 1930కి సమాచారమివ్వాలి. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రూ.లక్షన్నర లోపు అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆపైన మాత్రమే మేం కంప్లైంట్ తీసుకుంటాం.
‑ శ్రీధర్, ఏసీపీ, సైబరాబాద్