- టెక్నాలజీ సమస్యలతో నేరాలను పసిగట్టలేకపోతున్న పోలీసులు
- ఫిర్యాదుల పరిష్కారంలో సవాలక్ష ఇబ్బందులు
- హోల్డ్‌లో పెట్టిన పైసలు విడిపించడం లేకపోతున్న వైనం
నల్గొండ, వెలుగు : సైబర్ నేరగాళ్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సవాళ్లు విసురుతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని పరిష్కరించడంలో సైబర్ వింగ్స్‌కు సాంకేతికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సైబర్ నేరాల్లో చిక్కుకున్న బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆఫీసర్లకు కూడా అంతుచిక్కడం లేదు. చివరకు హోల్డ్‌లో పెట్టిన పైసలు కూడా బాధితులకు ఇప్పించలేకపోతున్నారు.
ఇలాంకి కేసులు చాలానే పెండింగ్‌లో ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదిచాలదన్నట్టుగా సైబర్ నేరాలు చేస్తున్న వారు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఓటీపీలు తెలుసుకొని డబ్బులు కొల్లగొట్టిన నేరగాళ్లు ఇప్పుడు మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తూ గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ద్వారా డబ్బులను దోచుకుంటున్నారు. ఇలా తమ కార్డుల నుంచి డబ్బులు పోతున్నట్లు బాధితులకే తెలియకపోడం గమనార్హం.
పెరుగుతున్న సైబర్ నేరాలు
సైబర్ నేరాల సంఖ్యరోజురోజుకు పెరుగుతోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేస్తే నిందితుల అకౌంట్‌ను బ్లాక్ చేస్తామని, దీని వల్ల నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చని పోలీసులు చెబుతున్నారు. కానీ కేసులు మాత్రం స్టేషన్‌లోనే పెండింగ్‌లో ఉంటున్నాయి. నల్గొండ జిల్లాలోని ఒక్కో స్టేషన్‌లో 10 నుంచి 15 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయి. 2023, 2024లో కలిపి సుమారు 300 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిల్లో చాలా కేసులు కోర్టుల్లోనే పెండింగ్‌లో ఉన్నాయి.
రూ. 25 వేలలోపు పోయిన కేసులను వెంటనే పరిష్కరించి హోల్డ్‌లో ఉన్న డబ్బులను బాధితులకు తిరిగి ఇప్పించాలని స్టేట్ లీగల్ సెల్ అథారిటీ చెప్తోంది. కానీ జిల్లాలో కొన్ని కోర్టుల్లో మాత్రమే కేసులు త్వరగా క్లియర్ అవుతున్నాయి. చివరకు లోక్ అదాలత్‌లో పెట్టినా బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదు. ఎస్పీలు చొరవ తీసుకున్న జిల్లాల్లో మాత్రమే కేసులు కాస్త త్వరగా పరిష్కారం అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త దారుల్లో సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు రోజురోజుకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. దీంతో ఇతర నేరాలను ఎంక్వైరీ చేసినంత ఈజీగా సైబర్ క్రైమ్స్‌ను పసిగట్టలేకపోతున్నారు. ఓటీపీలను షేర్ చేయొద్దని, లింక్‌లు ఓపెన్ చేయొద్దని, సీవీఆర్ నంబర్లు ఎవరికీ చెప్పొద్దని ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. కానీ నేరాలకు పాల్పడుతున్న వారు మాత్రం తెలివిగా సొమ్ము కాజేస్తున్నారు. కొత్తగా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ గూగుల్, ఫోన్ పే యాప్స్‌కు లింక్ అయిన క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి డబ్బులను కాజేస్తున్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్న బాధితులు సైబర్ సెల్‌కు కంప్లైంట్ చేసే వరకే మోసగాళ్లు డబ్బులను వాడుకోవడం గానీ, మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం గానీ చేస్తున్నారు. దీంతో బాధితుల డబ్బులను హోల్డ్ చేయలేకపోతున్నారు. బ్యాంకర్లు మాత్రం ఓటీపీ నంబర్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగినందున డబ్బులు బాధితులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే అంబుడ్స్‌మన్ డిపార్ట్‌మెంట్ సాయంతో మోసపూరిత లావాదేవీలను గుర్తించడం బ్యాంకర్లకు సాధ్యం అవుతుందని, కానీ ఆర్‌బీఐ రూల్స్‌ను సాకుగా చూపి వారు తప్పించుకుంటున్నారని సైబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు
సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్‌ను నియమించారు. కానీ స్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా వీరిని వేరే సర్వీసులకు వాడుకుంటున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదుల గురించి ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. తమ ఖాతాల్లోంచి డబ్బులు పోయాయని ఆలస్యంగా గుర్తించిన బాధితులకు సైబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సాయం అందించలేకపోతున్నారు. సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతుండడంతో నేరాలను అరికట్టలేకపోతున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌కు వాడుతున్న అత్యాధునిక టెక్నాలజీని సైబర్ డిపార్ట్‌మెంట్‌కు కూడా అనుసంధానిస్తే తప్ప నేరాలను పసిగట్టలేమని ఆఫీసర్లు అంటున్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కోసమే 200 మందికి పైగా పోలీసులను వాడుకుంది. కానీ జిల్లా సైబర్ సెల్‌లో కేవలం డీఎస్పీ స్థాయి అధికారి, ఒకటి, రెండు కంప్యూటర్లు, ఒక కానిస్టేబుల్ తప్ప మిగతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు.
నల్గొండకు చెందిన ఓ యువకుడి క్రెడిట్ కార్డు నుంచి ఇటీవల రూ. 50 వేలు కట్ అయ్యాయి. క్రెడిట్ కార్డు ఫోన్‌పే యాప్‌కు లింక్ అయి ఉండడంతో అతడి ప్రమేయం లేకుండానే డబ్బులు కట్ అయ్యాయి. గుర్తించిన సదరు యువకుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరగాళ్లు యువకుడి ఫోన్‌ను హ్యాక్ చేసి ఫోన్ పే ద్వారా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. నేరం చేసిన వారు అప్పటికే డబ్బులు వాడుకోవడంతో వాటిని హోల్డ్‌లో పెట్టలేకపోయారు.
అయితే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీకీ ఓటీపీలు వచ్చాయి కాబట్టి ఆ డబ్బులు మీరే కట్టాలని బ్యాంక్ నుంచి యువకుడికి ఒత్తిళ్లు మొదలయ్యాయి. బాధితుడు సైబర్ పోలీసులను సంప్రదించగా ఓటీపీలు వచ్చాయని బ్యాంకు సిబ్బంది చెబుతున్నందున మీరే చెల్లించాలని సూచించారు.
జిల్లాకే చెందిన ఓ వ్యక్తి ఖాతాల్లోంచి రూ.60 లక్షలు చోరికి గురయ్యాయి. ఈ విషయంపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆఫీసర్లు నిందితుల అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అయితే రూ. 60 లక్షల్లో అప్పటికే రూ.50 లక్షలు వాడుకోగా మిగతా రూ.10 లక్షలను హోల్డ్‌లో పెట్టారు. హోల్డ్‌లో ఉన్న డబ్బులను విడిపించేందుకు సైబర్ వింగ్ అష్టకష్టాలు పడుతోంది.