- సరికొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు
- కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల్లో 86 కేసులు నమోదు
- రూ. 2 కోట్ల వరకు మోసపోయిన అమాయకులు
- వాట్సాప్ లో ఫేక్ పోలీస్ ఐడీతో కాల్స్
కామారెడ్డి, నిజామాబాద్ వెలుగు: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త పద్ధతులు అవలంబిస్తూ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్‌నేరాల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరు నెలల్లో 86 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో రూ.2 కోట్ల వరకు బాధితులు నష్టపోయారు.
అవేర్‌నెస్ కల్పిస్తున్నా..
మరో వైపు సైబర్ నేరాల పట్ల అలర్టుగా ఉండాలంటూ పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన ప్రోగ్రాంలు నిర్వహిస్తోంది. స్కూల్స్, కాలేజీలు, జనవాసాల్లో అవేర్‌నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను సరిజేయాల్సి ఉందని ఫోన్‌చేసి ఆధార్‌నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటీపీలు అడుగుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఫ్యామిలీ మెంబర్స్కష్టాల్లో ఉన్నారని, రక్షించేందుకు తాము సూచించిన అకౌంట్‌కు అమౌంట్పంపించాలంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. పోలీసుల పేరుతో కూడా కొందరికి ఫోన్లు చేస్తున్నారు. అవతలి వ్యక్తులు చెప్పే మాటలు నిజమేనని నమ్మి జనం మోసపోతున్నారు.
కొన్ని సంఘటనలు ఇలా..
వారం రోజుల క్రితం కామారెడ్డిటౌన్కు చెందిన చంద్రశేఖర్అనే వ్యక్తికి వాట్సాప్ లో బ్యాంకు పేరిట ఓ సందేశం వచ్చింది. తన అకౌంట్ఉన్న బ్యాంక్ మెసేజ్తీరుగానే ఆ మెనేజ్ ఉండటంతో ఓకే చేశారు. దీంతో ఫోన్ హ్యక్ అయింది. అకౌంట్నుంచి రూ. 2. 70 లక్షలు ఖాళీ అయ్యాయి. ఇతనికే కాకుండా మరో ఇద్దరు కూడా ఇదే విధంగా మోసపోయారు. 15 రోజుల క్రితం పాల్వంచ మండలం భవానిపేట రైతు వెంకట్‌రెడ్డి సెల్ ఫోన్‌కు సైబర్ నేరస్తుల నుంచి ఫోన్ వచ్చింది.
ఆమెరికాలో ఉన్న మీ బిడ్డ ఇబ్బందుల్లో ఉందని, ఆమెను రక్షించేందుకు అమౌంట్పంపాలని కోరారు. రెండు విడతల్లో రూ. లక్ష కొట్టేశారు. 2 రోజుల తర్వాత బిడ్డకు తండ్రి ఫోన్ చేసి విషయం కనుక్కోగా తాను ఎలాంటి ఇబ్బందుల్లో లేనని ఎవరో మోసగించారని చెప్పింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రానికి చెందిన మాధవరెడ్డికి మీ కూతురు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఢిల్లీకి తీసుకెళుతున్నాం. వెంటనే రూ. 50 వేలు అకౌంట్‌లో జమ చేయండని వాట్సాప్‌లో పోలీసు డీపీతో కాల్ చేశారు.
వెరిఫై చేసుకోగా.. ఫేక్ కాల్ అని తేలింది. మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సెగ్మెంట్ రాంపూర్ గ్రామానికి చెందిన యువతికి కాల్ చేసి మీ తండ్రి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. వెంటనే రూ.10 వేలు పంపు.. లేకపోతే కాళ్లు చేతులు నరికేస్తామంటూ బెదిరింపు కాల్ చేశారు. జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌కు చెందిన రాములుకు జులై 29న వాట్సాప్ కాల్ వచ్చింది. మీ కొడుకు గంజాయి కేసులో పట్టుబడ్డాడని వదిలేయడానికి డబ్బు కావాలని కోరాడు. మూడు విడత ల్లో రూ.95 వేలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత కొడుకు రాములుకు ఫోన్ చేయగా ఇంటి దగ్గర్లో ఉన్నానని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు.
మోసపూరిత కాల్స్వస్తే ఫిర్యాదు చేయాలి
సైబర్ నేరస్తులు కొత్త పద్ధతులు అవలంభిస్తూ ఫోన్లు చేస్తున్నారు. మోసపూరిత కాల్స్ వస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. సెల్ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకోని పరిస్థితుల్లో సైబర్ కేటుగాళ్ల బారిన పడితే వెంటనే డయల్ 100, 1930 కు ఫోన్ చేయాలని సూచించారు.
– చంద్రశేఖర్‌రెడ్డి, కామారెడ్డి టౌన్ సీఐ