సైబర్ వల.. బాధితులు విలవిల !...అమాయకులే టార్గెట్ గా డబ్బులు లాగేస్తున్న మోసగాళ్లు

సైబర్ వల.. బాధితులు విలవిల !...అమాయకులే టార్గెట్ గా డబ్బులు లాగేస్తున్న మోసగాళ్లు
  • అప్రమత్తతే మేలంటున్న పోలీసులు

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో సైబర్​ మోసాలు పెరిగిపోతున్నాయి. పరువు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను, అధికారులను టార్గెట్​గా చేసుకుని డబ్బులు లాగేస్తున్నారు. బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా, ఇంకొందరు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. కాగా, ఏసీబీ అధికారులమని చెప్పి పలువురికి కాల్స్ చేసి బెదిరించిన ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు ఇటీవల స్వయంగా ఏసీబీ అధికారులు ఎవరైనా తమ పేరు చెబుతూ కాల్​చేస్తే నమ్మవద్దనిఓ ప్రకటన జారీ చేసి స్పష్టతనిచ్చారు.

కాగా, నిరుద్యోగులను టార్గెట్​గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ శాఖల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఎంపికలో పారదర్శకత కోసం అధికారులు అభ్యర్థుల వివరాలను ఆన్​లైన్ లో పొందుపర్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు అభ్యర్థులకు ఫోన్లు చేసి ఫేక్ ఆర్డర్ కాపీలు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు నిరుద్యోగులు నమ్మి డబ్బులు చెల్లించి, ఆఫీస్​లకు వెళ్లగా, అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.  అపరిచిత కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని, సైబర్​మోసాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. 

ఆగని ఫేక్​కాల్స్.. 

సైబర్ క్రైం పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలు ఆగడం లేదు. నిత్యం అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్, లింకులు వస్తున్నాయి. ఇటీవల జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్స్, ఎంఎల్​హెచ్​పీలతోపాటు పలు పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ ప్రక్రియను నెలల తరబడి నాన్చారు. దీంతో సైబర్ నేరగాళ్లు స్టాఫ్ నర్స్ అభ్యర్థులను టార్గెట్​చేసుకున్నారు. మహిళలకు రూ.25 వేలు, పురుషులకు లక్ష అని డిమాండ్ చేయగా, కొందరు డబ్బులు చెల్లించి మోసపోయారు. జిల్లాకు చెందిన ఒకరు రూ.75 వేలు, మరొకరు రూ.40 వేలు, ఇంకొకరు రూ.20 వేలు నష్టపోయినట్లు అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

వీరితోపాటు పదుల సంఖ్యలో అప్పట్లో డీఎంహెచ్​వో ఆఫీస్​కు వచ్చి అసలు విషయం తెలుసుకుని బోరుమన్నారు. గత నెలలో జనగామకు చెందిన ఓ వితంతువుకు ఫోన్ చేసి మీ భర్తకు సంబధించిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ముందుగా మీ ఫోన్ పే నుంచి కొంత డబ్బులు పంపాలని చెప్పడంతో నమ్మిన సదరు మహిళ, ఇరుగు పొరుగువారి ఫోన్ నుంచి రూ.80 వేల వరకు పంపించి నష్టపోయింది.

జనగామలోని ఓ ప్రభుత్వ అధికారికి యువతితో న్యూడ్ కాల్ చేయించి ఆ తర్వాత బ్లాక్​మెయిల్ చేసి డబ్బులు కాజేయాలని సైబర్ నేరగాళ్లు విఫలయత్నం చేశారు. నీ ఉద్యోగం పోతుందని బెదిరిస్తూ నిమిషాల గడువు కూడా ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన అధికారి పోలీసులను ఆశ్రయించి బయటపడ్డాడు. రెండు రోజుల క్రితం ఓ రియల్టర్​కు అపరిచితుడు కాల్ చేసి మీ కొడుకు అరెస్ట్ అయ్యాడని, చేసిన ఫేక్ కాల్ వెలుగులోకి వచ్చింది. ఇలా సైబర్​ నేరగాళ్ల బారినపడి మోసపోతున్న బాధితులు పదుల సంఖ్యలో ఉంటున్నట్లు పలువురు వాపోతున్నారు. 

అపరిచిత కాల్స్ ను నమ్మొద్దు.. 

అపరిచిత కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి. 92 సిరీస్​తో మొదలయ్యే మొబైల్ నంబర్​తో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. పోలీసు అధికారులెవరూ కూడా డీపీలు పెట్టుకుని వీడియో కాల్ చేసి బెదిరించరు. అపరిచిత వ్యక్తులు లింక్​లు పంపిస్తే ఓపెన్ చేయొద్దు. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. ఎటువంటి అనుమానం వచ్చినా లోకల్ పోలీసులను ఆశ్రయించాలి. సైబర్​ క్రైం మోసాలపై 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.  రాజ మహేంద్ర నాయక్, డీసీపీ, జనగామ