సైబర్ క్రైం.. రోజు రోజుకు కొత్త తరహాలో మీ ఫోన్లలోకి వస్తుంది. బిగ్ ఇష్యూ.. ఏదైనా వైరల్ అవుతుంది అంటే చాలు.. ఆ వార్తలను బేస్ చేసుకుని లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు మాయం అవుతున్నాయి.. ఇప్పుడు అయోధ్య రాముడిని టార్గెట్ చేశారు సైబర్ చీటర్స్. అయోధ్య రాముడు ఫొటోలు, వీడియోలు, వార్తలతో లింక్స్ పంపిస్తున్నారు. వాటిని ఓపెన్ చేయగానే.. మీ మొబైల్ లోని డేటా అంతా వాళ్లకు చేరుతుంది. కొత్త తరహా సైబర్ ఎటాక్స్ పై నెటిజన్లను అలర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
అయోధ్య రాముడు లైవ్ ఫొటోలు, లైవ్ వీడియోలు, అయోధ్య రాముడి విశేషాలు అంటూ కొన్ని లింక్స్ మొబైల్ ఫోన్లకు వస్తున్నాయని.. వాటిని ఓపెన్ చేయటం ద్వారా మీ ఫోన్ హ్యాక్ అవుతుందని.. మీ ఫోన్ లో ఉన్న పేమెంట్ యాప్స్ డేటా మొత్తం వాళ్లకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైం పోలీసులు. అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలంటూ ఎక్స్ ద్వారా నెటిజన్లకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలను టార్గెట్ చేసి ఇలాంటి మెసేజ్ లు పంపిస్తున్నారని.. అయోధ్య రాముడికి సంబంధించిన లింక్స్, ఫొటోలు, వీడియోలు వచ్చినప్పుడు వెంటనే ఓపెన్ చేయొద్దని.. ఒకటికి రెండు సార్లు.. చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. జనవరి 22వ తేదీ అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది.. దేశ వ్యాప్తంగా సంబురంగా ఈ వేడుక జరుగుతుంది.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు బడా కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ అయ్యే లింక్స్ పంపిస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.