సైబర్ క్రైమ్ పోలీసులకుబాధితుల ఫిర్యాదు
బషీర్ బాగ్ - వెలుగు: సిటీకి చెందిన పలువురి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 2 కోట్లకు పైగా కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన మహిళ సూర్యలత తన స్పిన్నింగ్ మిల్ కంపెనీ మెటీరియల్‌కు బ్రిటన్‌కు చెందిన కంపెనీ నుంచి రూ.1 కోటి 40 లక్షల మెటీరియల్‌కు అగ్రిమెంట్ చేసుకుంది. మొదట రూ. 47 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసింది. మిగతా అమౌంట్ పంపేందుకు చూస్తుండగా ఒక మెయిల్ వచ్చింది. వేరే అకౌంట్‌కు మిగతా డబ్బులు పంపాలని సూచించగా.. రూ. 93 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేయగా.. తమకు అమౌంట్ రాలేదని చెప్పడంతో బాధిత మహిళ మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది. అలాగే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు బోరబండకు చెందిన ఓ వృద్ధురాలిని బురిడీ కొట్టించి.. పలు దఫాలుగా రూ. 63 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఎంప్లాయ్ కి పార్ట్ టైం జాబ్ పేరిట సైబర్ చీటర్స్ పరిచయమై.. యూట్యూబ్ , ఫేస్ బుక్ లో వీడియోలు లైక్స్, షేర్ చేయాలంటూ టాస్క్ లు ఇచ్చి అతని అకౌంట్ నుంచి రూ. 47 లక్షలు కొల్లగొట్టారు. సిటీకి చెందిన ఒక వ్యక్తి ఐఆర్టీసీలో ట్రైన్ టికెట్లను క్యాన్సల్ చేసి రిఫండ్‌కు గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ ను సెర్చ్ చేశాడు. సైబర్ నేరగాళ్ల ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్ ను సంప్రదించగా.. వారు పంపిన లింగ్ ఓపెన్ చేయగా.. అతని అకౌంట్ లోని రూ. 5 లక్షల 40 వేలు ఖాళీ అయ్యాయి. దీంతో బాధితుల ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.