వేలాది మందిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు
ఆరుగురిని అరెస్టు చేసిన బెంగళూర్ పోలీసులు
బెంగళూర్: పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశజూపి దేశవ్యాప్తంగా వందలాది మందిని సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వాళ్ల దగ్గరి నుంచి ఏకంగా రూ.854 కోట్లు లూటీ చేశారు. ఈ ముఠాను బెంగళూర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మనోజ్, ఫణీంద్ర, చక్రధర్, శ్రీనివాస్, సోమశేఖర్, వసంత్ ఉన్నారు. ఈ ఫ్రాడ్ మాస్టర్ మైండ్స్ అయిన మరో ముగ్గురిని గుర్తించిన పోలీసులు..
వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను బెంగళూర్ కమిషనర్ బి.దయానంద శనివారం వెల్లడించారు. ఈ గ్యాంగ్ వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా బాధితులను సంప్రదించేది.
ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లో డబ్బులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని నమ్మించేది. రూ.వెయ్యి నుంచి రూ.10 వేలు పెడితే రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు లాభం వస్తుందని ఆశ చూపేది. మొదట బాధితులు డిపాజిట్ చేసిన చిన్న మొత్తాలకు పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇచ్చేది. బాధితులకు నమ్మకం కుదిరినంక
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని కోరేది.
దేశవ్యాప్తంగా 5 వేల కేసులు
మొదట లాభాలు రావడంతో ఈ గ్యాంగ్ ను నమ్మి వేలాది మంది బాధితులు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశారు. బాధితులు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాక, ఆ డబ్బును ముఠాలోని వ్యక్తులు వెంటనే వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసేవారు. ఆ తర్వాత నుంచి బాధితులకు డబ్బులు తిరిగి వచ్చేది కాదు. తమ డబ్బులు తాము తీసుకుందామన్న వీలయ్యేది కాదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా 5,013 నమోదైనట్టు బెంగళూర్ పోలీసులు గుర్తించారు. బెంగళూర్ లో నమోదైన 17 కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ముఠా విషయం బయటపడింది. నిందితులు బాధితుల నుంచి వసూలు చేసిన రూ.854 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఉన్న 84 అకౌంట్లకు మళ్లించారు. క్రిప్టో, పేమెంట్ గేట్ వేలు, గేమింగ్ యాప్స్ ద్వారా ట్రాన్సక్షన్స్ చేశారు.