రైతన్నా జాగ్రత్త : రుణమాఫీ టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు.. లింక్స్ ఓపెన్ చేయొద్దు

రైతన్నా జాగ్రత్త : రుణమాఫీ టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు.. లింక్స్ ఓపెన్ చేయొద్దు

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తెలంగాణ రైతులను టార్గెట్ చేశారు. రైతుల ఖాతాల్లోకి అక్షరాల 7 వేల కోట్లు.. ప్రతి రైతు కుటుంబం ఖాతాలోకి అక్షరాల లక్ష రూపాయలు పడుతుండటంతో.. సైబర్ నేరగాళ్లు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. 

రైతుల ఖాతాల్లో పడే లక్ష రూపాయలను టార్గెట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. బ్యాంక్ పేరుతో మెసేజ్ లు, వాట్సాప్ లో బ్యాంక్ ప్రొఫైల్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతాలో రుణ మాఫీ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి అంటూ APK files పంపిస్తున్నారు. మీ బ్యాంక్ లో రుణ మాఫీ డబ్బులను ఈ కింద లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అంటూ లింక్స్ పంపిస్తున్నారని.. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది. 

కొంత మంది సైబర్ నేరగాళ్లు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా కొంత డబ్బు పంపించి.. మిగతా డబ్బుల కోసం లింక్ ఓపెన్ చేసి చూసుకోవాలని మెసేజ్ లు పంపిస్తున్నారని.. అలాంటి వాటికి కూడా స్పందించొద్దని కోరారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. రైతు రుణ మాఫీ పేరుతో వచ్చే లింక్స్ ను తొందరపడి ఓపెన్ చేయొద్దని.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో బ్యాంక్ వాళ్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవాలని లేదా బ్యాంక్ దగ్గరకు వెళ్లి విచారణ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎవరైనా పొరపాటున డబ్బులు పోగొట్టుకుని ఉంటే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు.