
Digital Arrest: ప్రభుత్వాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ మోసగాళ్లు విద్యావంతులను, స్కూల్ టీచర్లను, రిటైర్డ్ ఉద్యోగులను, వ్యాపారులతో సహా మోసగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమ జీవితకాలం కష్టపడి దాచుకున్న డబ్బును కోల్పోవటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి సమాజంలో వస్తున్న కొత్త మోసాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అవసరం.
వివరాల్లోకి వెళితే లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా మాన్సింగ్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్నారు. సదరు నిందితులు ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో 22 రోజుల వ్యవధిలో దాదాపు రూ.78 లక్షలు మోసగించినట్లు వెల్లడైంది. ఆమెకు చెందిన బ్యాంక్ ఖాతా ద్వారా అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు తాము గుర్తించామంటూ నిందితులు ఆమెపై దర్యాప్తు పేరుతో డిజిటల్ అరెస్ట్ కింద ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నిందితులు పలు దఫాలుగా ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేశారు. నిందితులు సూచించిన ఖాతాలకు ఆమె ఎప్పటికప్పుడు డబ్బు జమచేస్తూ వచ్చారు.
ఒంటరి మహిళగా ఉంటున్న ప్రమీళాను టార్గెట్ చేసిన నిందితులు తాము చెప్పినట్లు డబ్బు పంపించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించటంతో సదరు స్కూల్ టీచర్ ఆందోళన చెందినట్లు పోలీసులకు ఇచ్చిన వివరాల్లో వెల్లడించారు. అయితే మెుదటగా నిందితులు ఆమెకు వాట్సాప్ కాల్ ద్వారా చేరుకున్నారు. ఆమె పేరుపై దిల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా తెరవబడిందని, దాని నుంచి అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు వాళ్లు నమ్మబలికారు. అందువల్ల ఆమెపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయబడిందని, ఇన్వెస్టిగేషన్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఆమెను ఒప్పించారు.
నిందితులు దర్యాప్తు పూర్తయ్యాక ప్రమీళాకు డబ్బు తిరిగి ఇవ్వబడుతుందని హామీ ఇవ్వటంతో ఆమె నిందితుల వలలో చిక్కారు. అయితే తాము చెప్పే వరకు ఈ వివరాలను గోప్యంగానే ఉంచాలని ఎవ్వరితోనూ పంచుకోకూడదని కూడా సూచించారు. ఈ క్రమంలో దాదాపు మూడు వారాల వ్యవధిలో ఆమె నుంచి 78 లక్షల రూపాయలను వసూలు చేశారు.
ALSO READ : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో రూ. కోటి 22 లక్షలు టోకరా
ప్రస్తుతం చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి లేదని కొందరు నిందితులు సీబీఐ, కస్టమ్స్, ఇన్కమ్ టాక్స్ అంటూ వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పేర్లు, వారి లోగోలను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందువల్ల నిందితులు స్కైప్, వాట్సాప్, జూమ్ కాల్ వంటి మాద్యమాల ద్వారా సంప్రదించి ప్రజలను మోసగిస్తున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇలాంటి కాల్స్ అందుకుంటే వాటి వివరాలను సైబర్ క్రైమ్ లేదా దగ్గరలోని పోలీసులకు అందించాలని వారు సూచిస్తున్నారు.