బషీర్ బాగ్, వెలుగు: విమాన టికెట్ల పేరిట ప్రభుత్వ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 41 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిని యూఎస్ఏలో చదువుతున్న తన కూతురికి హాలిడేస్ రావడంతో ఇండియాకు తీసుకొచ్చేందుకు ఆన్లైన్లో ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో స్కై ఫేర్ ట్రావెల్ ఏజెంట్ పేరిట స్కామర్ బాధిత మహిళను సంప్రదించారు. ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లైట్ టికెట్‌ను యూఎస్ఏ నుంచి హైదరాబాద్‌కు బుకింగ్ చేశారు.
అందుకు రూ.1.12 లక్షలను బాధిత మహిళ ఫోన్ పే ద్వారా స్కామర్లకు పంపించింది. స్కామర్స్ పంపించిన రిఫరెన్స్ నంబర్‌ను ఆన్లైన్లో చెక్ చేయగా, టికెట్బుకింగ్ అయినట్లు చూపించింది. అనంతరం రెండు వారాల తరువాత మళ్లీ చెక్ చేయగా, ఎలాంటి బుకింగ్ కాలేదని చూపడంతో కంగుతిన్న మహిళ ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించింది. టెక్నీకల్ ప్రాబ్లమ్ వల్ల టికెట్ క్యాన్సల్ అయిందని డబ్బులను రిఫండ్ చేస్తామని నమ్మబలికారు.
రోజులు గడుస్తున్నా వారు మరింత సమయం కావాలని కోరారు. ఆ తరువాత కాల్స్ కు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.