బషీర్ బాగ్, వెలుగు: లాభాలు ఆశ చూపి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 37 ఏండ్ల ప్రైవేట్ మహిళా ఉద్యోగికి తొలుత వర్క్ ఫ్రమ్ హోం పేరిట సైబర్ చీటర్స్ వాట్సాప్ మెసేజ్ చేశారు. 3 ఐ ఇన్ఫోటెక్ ప్రతినిధిగా పరిచయం చేసుకొని, చెప్పిన రెస్టారెంట్ లకు గూగుల్ ద్వారా రివ్యూలు, రేటింగ్ లు ఇవ్వాలని సూచించారు. దీంతో టాస్క్ లను పూర్తి చేసి స్క్రీన్ షాట్లు పంపగా, ఆమెకు కొంత నగదు పంపించారు.
అనంతరం అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో బాధితురాలు రూ.3 వేల ఇన్వెస్ట్ చేసింది. స్కామర్లు కొంతసేపటికి రూ.3,800 చెల్లించారు. ఆ త తర్వాత టెక్నికల్ సమస్య ఉందని బాధిత మహిళ నంబర్ ను టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు. యూ కాయిన్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఆ గ్రూప్ లో లాభాలు పొందినట్లు ఇతర సభ్యుల స్క్రీన్ షాట్ లను షేర్ చేశారు.
దీంతో నమ్మిన మహిళ పలుమార్లు రూ. 11.92 లక్షలు పెట్టుబడి పెట్టింది. లాభాలు చెల్లించకుండా ఇంకా పెట్టుబడి పెట్టాలని స్కామర్లు ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు గ్రహించి బుధవారంసైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.