
బషీర్‌బాగ్, వెలుగు: ప్రైవేట్ సర్వీస్ కోసం ఆన్లైన్లో వెతికినఓ యువకుడు సైబర్ చీటర్స్ చేతికి చిక్కి నిండా మోసపోయాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సిటీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న 24 ఏళ్ల యువకుడు తొలుత ప్రైవేట్ సర్వీస్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. ఓ డేటింగ్ వెబ్సైట్లో ఉన్న నంబర్‌ను సంప్రదించాడు. అది స్కామర్స్ పెట్టిన నంబర్ అని తెలియని యువకుడు ప్రైవేట్ సర్వీస్ కోసం వారితో మాట్లాడాడు.
సర్వీస్ కోసం రూ.4 వేలు చెల్లించాల్సి వస్తుందని, తొలుత రూ.500 చెల్లించాలని, మిగిలిన డబ్బును హోటల్ కు వెళ్లాక ఇవ్వాలని స్కామర్లు సూచించారు. దీంతో యువకుడు రూ.500 చెల్లించాడు. ఆ తర్వాత మొత్తం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మిగిలిన డబ్బులను కూడా చెల్లించాడు. అనంతరం వివిధ సాకులతో అదనంగా డబ్బులను స్కామర్స్ డిమాండ్ చేశారు. బాధితుడు వాటిని తిరస్కరించి, తాను చెల్లించిన డబ్బులను రిటర్న్ చేయాలని కోరాడు. దీంతో రెండు నిమిషాల్లో రిటర్న్ ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు. అయితే, ముందుగా తెలిపిన అదనపు చెల్లింపులు చేస్తేనే రిఫండ్ అవుతాయని, చెల్లించిన డబ్బులకు రెట్టింపు రిఫండ్ చేస్తామని నమ్మించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు ఆ అదనపు చెల్లింపులు కూడా పూర్తి చేశాడు. అనంతరం బాధితుడి మొబైల్ కు బుకింగ్ ఐడీ, హోటల్ వివరాలు www.locanto.com లో పొందుపరిచామని, బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలని మెసేజ్ వచ్చింది. దీంతో ఇదంతా ఫ్రాడ్ అని గ్రహించిన బాధితుడు.. మొత్తం రూ 1,57,381 లను పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.