- రూ. 40.67 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
హనుమకొండ, వెలుగు : వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని మోసం చేశారు. పెట్టుబడులు పెట్టించి సుమారు రూ.40.67 లక్షలు కాజేశారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. ఏంజిల్ వన్, బ్లాక్ రాక్ ఐఎన్‌సీ అనే కంపెనీ జాయింట్ వెంచర్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు రెండు నెలల కింద గుండ్లసింగారం గ్రామానికి చెందిన ఓ యువకుడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు మెసేజ్ చేశారు.
దీనిని నమ్మిన యువకుడు వారిని కాంటాక్ట్ కావడంతో అతడి వాట్సప్‌కు ఓ లింక్ పంపించి, దాని ద్వారా ఏఎల్‌ఎఫ్‌డీ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు ఈ యాప్‌లో చూసుకునే వీలు ఉంటుందని నమ్మించడంతో విడతల వారీగా రూ.40.67 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దీంతో ఫిబ్రవరిలో రూ.19,16,524 లాభం వచ్చినట్లు చూపించారు.
15 శాతం ఇన్‌కం ట్యాక్స్ కట్టాలని, లేకపోతే మొత్తం డబ్బులు కంపెనీ అకౌంట్‌లోకి వెళ్తాయని భయపెట్టారు. తర్వాత ట్యాక్స్ డబ్బులు కట్టేలోగానే అతడి అకౌంట్‌లోని డబ్బులన్నింటిని ఖాళీ చేసేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువకుడు 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవ్ తెలిపారు.