
బషీర్బాగ్, వెలుగు: కరెంట్ బిల్లు కట్టలేదంటూ సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ మోసగాళ్లు ఫోన్ కాల్ చేసి, ఇంటి కరెంట్ బిల్లు కట్టలేదని, మరో రెండు గంటల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించారు. తాను బిల్లు పే చేశానని వృద్ధుడు చెప్పగా.. వీడియో కాల్ చేసి సిస్టమ్‌లో బిల్లు పెండింగ్‌లో ఉందంటూ చూపించారు.
బిల్లు పే చేయాలని ఓ అప్లికేషన్ ను సైబర్ చీటర్స్ వృద్ధుడికి పంపించి, ఇన్‌స్టాల్ చేయమని సూచించారు. వారి మాటలను నమ్మిన వృద్ధుడు అప్లికేషన్ ను ఇన్‌స్టాల్ చేసి, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు, కరెంట్ బిల్లు వివరాలను నమోదు చేశాడు. అనంతరం బాధితుడి మొబైల్‌కు అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. వృద్ధుడు తన క్రెడిట్ కార్డు నుంచి రూ. 49,999లు ఎనిమిది సార్లు మొత్తం రూ.3,99,992 లు పోగొట్టుకున్నట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.