హ్యూమన్ ట్రాఫికింగ్ పేరిట..ఎన్నారైకి రూ.13 లక్షల టోకరా

హ్యూమన్ ట్రాఫికింగ్ పేరిట..ఎన్నారైకి రూ.13 లక్షల టోకరా
  • సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయిన మహిళ

బషీర్​బాగ్, వెలుగు: మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్​కు పాల్పడ్డారని ఓ ఎన్నారైను సైబర్ చీటర్స్ మోసగించారు. యూకేలో జాబ్​చేస్తున్న 44 ఏళ్ల మహిళ సెలవుల కోసం హైదరాబాద్​కు వచ్చి తాత్కాలికంగా ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటోంది. బాధిత మహిళకు స్కామర్స్ ఫోన్ కాల్ చేసి, ట్రాయ్ అధికారుల పేరిట మాట్లాడారు. ఆమె మొబైల్ నంబర్ నుంచి చట్టవ్యతిరేకమైన ప్రకటనలు, వేధించే మెసేజ్ లు చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని బాధిత మహిళ చెప్పగా, ఆ కాల్ ను పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట స్కామర్ బాధితురాలితో వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యాడు. 

ఢిల్లీకి చెందిన ఓ ఆర్థిక నేరస్తుడు బాధిత మహిళ ఆధార్ కార్డు ఉపయోగించి ఢిల్లీలో హెచ్ డీఎఫ్​సీ  బ్యాంక్ అకౌంట్ తెరిచి, మనీ ల్యాండరింగ్, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసులో బాధితురాలిని వెంటనే అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సీబీఐ అధికారిగా నటిస్తున్న స్కామర్ మరో కాల్ చేసి, బాధితురాలి ఆధార్ కార్డు చూపించాలని , ఈ విషయం ఎవరికి చెప్పొద్దని సూచించాడు. 

సీబీఐ  లెటర్ హెడ్ చూపిస్తూ , ఈ విషయం ఎవరికైనా తెలిపితే జైలులో పెడతామని హెచ్చరించారు. ఈ కేసులో బాధితురాలి ప్రమేయం లేదని తేల్చేందుకు ఆమె అకౌంట్ లో ఉన్న నగదు బదిలీ చేయాలని, ఆర్బీఐ గైడ్ లైన్స్ మేరకు విచారణ జరిపి ప్రమేయం లేకపోతే క్లియరెన్స్ సర్టిఫికెట్ తో పాటు ఆ నగదును తిరిగి పంపిస్తామని తెలిపారు. 

ఇదంతా నిజమని నమ్మిన బాధితురాలు మొత్తం రూ. 13,29,999 లను స్కామర్స్ అకౌంట్ కు బదిలీ చేసింది. అనంతరం బాధితురాలు స్కామర్స్ కు ఫోన్ కాల్ చేయగా, వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.