హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన ఆరు గ్యారంటీల స్కీమ్‌ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అర్హుల ఎంపిక పేరిట ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్, మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ నంబ ర్‌కి వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరుతున్నారు. ఓటీపీ ఎంట్రీ చేయకపోతే అప్లికేషన్ ప్రాసెస్ జరగదని భయపెడుతున్నారు. ఇలా ఓటీపీ చెప్పిన వారి అకౌంట్స్‌ను ఖాళీ చేయాలని ప్లాన్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొందరికి ఇలాంటి కాల్స్ వచ్చాయి.
సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అలెర్టయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌లో లింక్స్, కాల్స్ వస్తే స్పందించకూడదని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సైబర్ నేరగాళ్ల కాల్ అని తెలిస్తే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.