Cyber Crime : OTP పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు

సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్థులు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. మార్చి 18న చందానగర్ పోలీసులు ఇద్దరు సైబర్ నేరస్థులను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి పది లక్షల విలువైన 3 లాప్ టాప్ లు, 15 మొబైల్స్, ఒక యమహా బైక్, లక్షా నలభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మీడియాకు మరిన్ని విషయాలను వెల్లడించారు. "ఇద్దరు సైబర్ నేరస్థులను అరెస్ట్ చేశాం.. దేశవ్యాప్తంగా ఈ ఇద్దరిపై 41 కేసులు నమోదైయ్యాయి. ఎనీడెస్క్ వంటి పలు యాప్ లు ఫోన్ లో డౌన్ లోడ్ చేయించి భారీగా డబ్బును కాజేస్తున్నారు. ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని డీసీపీ చెప్పారు.

పట్టుబడిన నేరస్థులు A1 వేముల నాగ ప్రేమ్ అమెజాన్ సేల్స్ లో పని చేస్తున్నాడు, A2 బనావత్ కుమార్ అమెజాన్ ప్యాకింగ్ లో పని చేస్తున్నాడు..నిందితులు నల్గొండకు చెందిన వారు. జార్ఖండ్ కు చెందిన A3 రాహుల్ పరారీలో ఉన్నాడు. అయితే A3 చేతిలో గతంలో A1, A2 లు మోసపోయారు. ఆ తర్వాత A3తో కలిసి వారు సైబర్ క్రైం చేయడం మొదలు పెట్టారు. నాగప్రేమ్, బనావత్ కుమార్ లు జార్ఖండ్ గ్యాంగ్ తో కలిసి ఇప్పటి వరకు 1800 సైబర్ క్రైంలు చేశారు. అయితే  కొంతకాలం తర్వాత A1, A2 ఇద్దరు కలిసి సొంతంగా నేరాలకు పాల్పడుతున్నారు. 

ఇటీవల ఓ వృద్ధురాలి బ్యాంకు నుండి డబ్బు కొట్టేశారు. ఆ వృద్ధురాలు రెండు రోజుల క్రితం ఒక కొత్త సిమ్ కార్టు కొనుగోలు చేసింది. ఇది గమనించిన నేరస్థులు.. ఆమె ఫోన్ కు ఒక మెసెజ్ పంపిచారు. ఆమె వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేసింది. మీ సిమ్ యాక్టివేట్ చేయాలని చెప్పి ఆ వృద్ధురాలి ఫోన్ లో ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుమని చెప్పారు.. తర్వాత ఓటీపీ నెంబర్ వస్తుంది చెప్పమని అడిగారు. ఆమె నెంబర్ చెప్పడంతో తన బ్యాంకు నుండి రూ.లక్షా ముప్పై వేలు కొట్టేశారు. మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అవగాహన లేకపోవడం, అత్యాశ కారణంగా సైబర్ క్రైం పెరుగుతుంది" అని డీసీపీ తెలిపారు.