సైబర్‌‌ కాంగ్రెస్‌‌ ప్రాజెక్ట్‌‌లో భాగంగా ‘సైబ్‌‌ హర్‌‌’ కార్యక్రమం

సూర్యాపేట కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట, వెలుగు : సైబర్‌‌ నేరాలపై స్టూడెంట్లు, ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌ సూచించారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ‘సైబ్‌‌ హర్‌‌’ అవగాహన కార్యక్రమం, బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్‌‌ నేరాలు, ఆన్‌‌లైన్‌‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో సైబర్‌‌ కాంగ్రెస్‌‌ ప్రాజెక్ట్‌‌లో భాగంగా ‘సైబ్‌‌ హర్‌‌’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అంబాసిడర్లుగా స్టూడెంట్లను నియమించినట్లు చెప్పారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. 

సైబర్‌‌ మోసాల పట్ల స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సైబర్‌‌ మోసాలపై చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించాలని, దీని వల్ల నేరాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లను పట్టించుకోవద్దని, లింక్‌‌లను ఓపెన్‌‌ చేయవద్దని సూచించారు. ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే షీ టీమ్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘సైబ్‌‌ హర్‌‌’ ట్రైనింగ్‌‌లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 1,650 మంది టీచర్లు, 3,300 మంది స్టూడెంట్లు, 80 క్లబ్‌‌లకు పోలీస్‌‌, ఎడ్యుకేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం సైబర్‌‌ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పుస్తకాలన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఈవో అశోక్‌‌, డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌‌రెడ్డి, టౌన్‌‌ సీఐ రాజశేఖర్‌‌ పాల్గొన్నారు.

సోషల్‌‌ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి

నల్గొండ, వెలుగు : సైబర్‌‌ నేరాలు, సోషల్‌‌ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని నల్గొండ ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. ఉమెన్‌‌ సేఫ్టీ వింగ్‌‌, పోలీస్‌‌, ఎడ్యుకేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆమె  మాట్లాడారు. జిల్లాలోని 52 స్కూళ్ల నుంచి 104 మంది స్టూడెంట్లు, 52 మంది టీచర్లను ఎంపిక చేసి వారికి సైబర్‌‌ నేరాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. మహిళల భద్రతకు పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోషల్‌‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌‌ చేసే టైంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం ట్రైనింగ్‌‌లో ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ రాహుల్‌‌శర్మ, నోడల్‌‌ ఆఫీసర్‌‌, అడిషనల్ ఎస్పీ అశ్వాక్, డీఈవో భిక్షపతి, షీటీమ్‌‌ ఇన్‌‌చార్జి సీఐ రాజశేఖర్‌‌గౌడ్‌‌, సైబర్‌‌ క్రైమ్స్‌‌ ఎస్సై నాగరాజు, జెండర్‌‌ కో ఆర్డినేటర్‌‌ సరిత పాల్గొన్నారు.