సైబర్​ కేటుగాళ్లు రూ.లక్షలు కొట్టేశారు : ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్

  •     ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  •     మహబూబాబాద్​ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్

మహబూబాబాద్, వెలుగు : జిల్లాలో పలువురు సైబర్​మోసాలకు గురై లక్షల్లో మోసపోయారని, ప్రజలు ఆన్​లైన్​, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు బాధితులు సైబర్ మోసాలతో రూ.లక్షల్లో నష్టపోయారని తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ వ్యక్తికి  ఇటీవల తెలియని నెంబర్ నుంచి అమ్మాయి డీపీతో పార్ట్ టైం జాబ్ కావాలా అనే మెసేజ్ వచ్చింది. బాధితుడు రిప్లే మెసేజ్ చేయగా, నేరస్తులు ఒక యూట్యూబ్ వీడియో లింక్ పెట్టి దానిని లైక్ అండ్ షేర్ చేసి, స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పాడు.

ఇలా మూడుసార్లు మూడు టాస్కులు చేయగా, ఇందుకు గానూ అతడికి రూ.150 విత్ డ్రా కోడ్​పంపారు. విత్ డ్రా చేసేందుకు టెలిగ్రామ్ ప్రొఫైల్ లింక్ ని పంపి, ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వమని తెలిపారు. బాధితుడు ఆ లింకును క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లోని ఓ లేడీని కాంటాక్ట్ అయ్యి, తన విత్ డ్రా కోడ్​ను తెలుపగా, బాధితుడి వ్యక్తిగత వివరాలు తెలుసుకొని రూ.150  అతడి ఎకౌంట్ కు పంపారు. ఆ తర్వాత అతడిని టెలిగ్రామ్ గ్రూప్​లో యాడ్ చేశారు. అతడితో టాస్క్ లు చేయిస్తూ ఒక్కోటాస్క్ లో కొంత మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే

లాభాలు వస్తాయని నమ్మించి కొంత లాభాన్ని బాధితుడి అకౌంట్లో ఆన్ లైన్​తో జమ చేసి  నమ్మించారు. గ్రూపులో ఉన్న సైబర్ నేరగాళ్లందరూ ఉండి ఒకరికి మరొకరు తెలినట్టుగా నటిస్తూ బాధితులలా ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతున్నట్లు నటిస్తూ ఫేక్ స్క్రీన్ షాట్లను బాధితుడిని నమ్మించడానికి గ్రూపులో పెట్టారు. అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి బాధితుడి నుంచి రూ.లక్షల్లో ఇన్వెస్ట్ చేయించారు. లాభాలను ఫేక్ వెబ్​సైట్​ద్వారా చూపించారు. బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, అవి జమ కాలేదు.

మీరు ఇంకా కొంత అమౌంట్ జమ చేస్తే అన్నీ కలిపి మీకు డబ్బులు వస్తాయని నమ్మించి, అతడితో సుమారు రూ. 12 లక్షల వరకు ఇన్​వెస్ట్​చేయించారని తెలిపారు. మోసాన్ని గమనించిన బాధితుడు 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడని, ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లాలోని మరో వ్యక్తి  రూ.32 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. సైబర్​ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయాలని, www.cybercrime.gov.in వెబ్​సైట్​ద్వారా వెంటనే ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.