
టెక్నాలజీ ఎంత స్పీడ్ గా పెరుగుతుందో అంతే స్పీడ్ తో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ స్కామర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. క్షణాల్లో బ్యాంకు అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఆన్ లైన్ టాస్క్ లు పూర్తి చేస్తే భారీ మొత్తంలో కమీషన్లు ఇస్తామని లక్షలు కాజేసిన ఘటన బషీర్ బాగ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్లో టాస్క్‌లు పూర్తి చేస్తే కమీషన్లు ఇస్తామని నమ్మించి, ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సిటీకి చెందిన 30 ఏండ్ల ప్రైవేటు ఉద్యోగికి తొలుత వాట్సాప్ ద్వారా స్కామర్లు మెసేజ్ చేశారు. మీషో మాల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ చేరి, టాస్క్ లు పూర్తి చేస్తే కమీషన్ , బోనస్ లు ఇస్తామన్నారు.
దీంతో బాధితుడు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ లాభాలు వస్తున్నట్లు పలువురు స్క్రీన్ షాట్స్ పంపించడంతో ఇదంతా నిజమేనని నమ్మాడు. తన అకౌంట్ నుంచి డబ్బులను స్కామర్స్ సూచించిన అకౌంట్ కు పంపించాడు. అనంతరం కమీషన్ కోసం మీషో ఆన్లైన్లో ఆర్డర్స్ చేయాలంటూ నాలుగు టాస్క్ లను స్కామర్స్ ఇచ్చారు.
వాటిని పూర్తి చేసిన తరువాత తనకు వచ్చిన కమీషన్ ను విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా, విఫలం అయ్యాడు. కాసేపటికి క్రెడిట్ స్కోర్ 100 కంటే తక్కువ ఉందని, డబ్బులను విత్ డ్రా చేయడానికి మరికొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. పలు దఫాలుగా మొత్తం రూ 1,67,800 లను పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు.