అశ్లీల వీడియోలు చూస్తున్నారంటూ వృద్ధుడిని మోసగించిన సైబర్ చీటర్స్

అశ్లీల వీడియోలు చూస్తున్నారంటూ వృద్ధుడిని మోసగించిన సైబర్ చీటర్స్
  •  డ్రగ్స్​, మనీలాండరింగ్​కేసులున్నాయంటూ బెదిరింపు
  •  కేసు లేకుండా చేస్తామని రూ.లక్షన్నర కొట్టేసిన కేటుగాళ్లు 

బషీర్ బాగ్, వెలుగు : నగరానికి చెందిన 84 ఏండ్ల వృద్ధుడిని సైబర్ క్రిమినల్స్​మోసగించారు. పోర్న్ వీడియోస్ చూస్తున్నావని, కేసు నమోదు చేస్తామని లక్షన్నర కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం..రిటైర్డ్​ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ వృద్ధుడి మొబైల్ కు కొద్ది రోజుల కింద సైబర్ చీటర్స్ ఫోన్ చేసి ‘మీ మొబైల్ సర్వీస్ డిస్​కనెక్ట్​అవుతుంది. కాబట్టి మొబైల్ లో 9 నంబర్​నొక్కండి’ అని కోరారు. బాధితుడు వారు చెప్పినట్టు చేయగానే అతడి కాల్​లక్నో లోని ఆలం బాగ్ పీఎస్​కు కనెక్ట్​అయ్యిందని నమ్మబలికారు.

సైబర్ నేరగాళ్లు పోలీసులుగా మాట్లాడుతూ బాధితుడి ఆధార్ వివరాలు సేకరించారు. తర్వాత అతడిపై పోర్న్ యాక్ట్ , మనీ లాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని బెదిరించారు. బాధితుడిపై ఢిల్లీలో జారీ అయ్యిందని చెప్తూ ఓ ఫేక్​అరెస్ట్​వారెంట్ ను వాట్సాప్ కు పంపించారు. కేసును సీబీఐకి రెఫర్​చేశామని, కాల్ ను సీబీఐకి కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి నకిలీ సీబీఐ ఆఫీసర్​లా మాట్లాడారు. కేసులు లేకుండా చూడాలంటే మూడు అకౌంట్లలో ఉన్న డబ్బులను పంపించాలని ఒత్తిడి చేశారు.

ఆ డబ్బును ఆర్బీఐ గైడ్​లైన్స్​ప్రకారం వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని చెప్పారు. దీంతో అతడు అకౌంట్లలో ఉన్న రూ. 1,53,000 ను సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు ట్రాన్స్​ఫర్​చేశాడు. వారి నుంచి మళ్లీ కాల్​రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.