సైబర్ నేరాల ప్రధాన సూత్రదారి అరెస్ట్

సైబర్  నేరాల ప్రధాన సూత్రదారి అరెస్ట్
  • రూ.80 లక్షల విలువైన ఆస్తులు, కారు స్వాధీనం

వనపర్తి, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని తండాలు, గ్రామాల్లో యువకులకు డబ్బు ఆశ చూపి సైబర్  నేరాల వైపు మళ్లిస్తున్న సైబర్  నేరాల ప్రధాన సూత్రదారుడు వర్త్యావత్  రమేశ్​ నాయక్ ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు సైబర్​ క్రైం డీఎస్పీ ఎన్​బీ రత్నం, సీఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం వనపర్తిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. 

నాలుగేండ్లుగా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్స్  పేరుతో సైబర్  నేరాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్​ చేశామని తెలిపారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు రమేశ్​నాయక్​ ఇప్పటివరకు రూ. కోటికి పైగా సంపాదించాడని చెప్పారు. నిందితుడికి సహకరించిన అతడి అన్న చంద్రశేఖర్, తల్లి గోపమ్మపై కేసు నమోదు చేశామని తెలిపారు. సైబర్​ మోసాలతో సంపాదించిన డబ్బులతో రూ.45 లక్షలతో తండాలో ఇల్లు కట్టాడని, వనపర్తి పట్టణంలో రూ. 24 లక్షల విలువైన రెండు ప్లాట్లను, రూ.12.50 లక్షల కారు కొన్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్  ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసినట్లు తెలిపారు.