- సైబర్ నేరస్తులపై దండయాత్ర
- మూడు రాష్ట్రాల్లో సైబర్ క్రైం పోలీసుల ఆపరేషన్
- 18 మంది అరెస్టు.. రూ.1.61 కోట్లు ఫ్రీజ్
- దేశవ్యాప్తంగా 364 కేసుల్లో వాంటెడ్ అఫెండర్లు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర పోలీసుల దండయాత్ర కొనసాగుతున్నది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ),సైబర్ క్రైమ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 6 ప్రత్యేక బృందాలతో వారం రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేశారు. దేశవ్యాప్తంగా 364 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న 18 మందిని అరెస్టు చేశారు.
నిందితుల బ్యాంక్ అకౌంట్లలోని రూ.1.61 కోట్లను ఫ్రీజ్ చేశారు. వారిలో ముగ్గురు సైబర్ కింగ్ పిన్స్ కాగా మరో 15 మంది బ్యాంకు ఖాతాలను సప్లై చేసే వారున్నారు. నిందితుల వద్ద రూ.5 లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు,7 పాస్‌బుక్‌లు, 11 చెక్ బుక్స్, 10 సిమ్ కార్డులు, 2 ల్యాప్‌టాప్స్, 2 డెస్క్‌టాప్ కంప్యూటర్లు , హార్డ్‌డిస్క్, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వారిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సిటీ సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన ఆరు ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్టుతో బెదిరించి డబ్బులు వసూలు చేయడం, సెక్స్‌టార్షన్, ఇన్సూరెన్స్, ఓటీపీ ఫ్రాడ్ కేసుల్లో నిందితులు మొత్తం రూ.6.94 కోట్లు కొట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 45 కేసులు సహా దేశవ్యాప్తంగా మరో 319 కేసుల్లో నిందితులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల లింక్స్ దొరికాయి.
వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. బాధితులు అందించిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ముంబైలో ఆరుగురు, బెంగళూరులో ఐదుగురు, అజ్మీర్‌కు చెందిన ముగ్గురు, భరత్‌పూర్ (రాజస్థాన్) కు చెందిన ఇద్దరు సహా నాగపూర్‌లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టుల్లో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్లు తీసుకుని హైదరాబాద్ తరలించారు.
ఫెడెక్స్ కాల్స్‌కు స్పందించవద్దు
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, సీబీఐ, మనీ లాండరింగ్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించ వద్దని ఆయన సూచించారు. ఎలాంటి మోసం గురైనా వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.