- ఈ ఏడాది 1,14,174 ఫిర్యాదులు
- రాష్ట్రంలో ఏడు సైబర్ క్రైమ్ స్టేషన్లు
- 519 కేసులు నమోదు 186 మంది అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 18శాతం సైబర్ నేరాలు పెరిగాయి. గత ఏడాది 91,652 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది 1,14,174 వచ్చాయి. వాటిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండంలలో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 519 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయగా 186 మంది నిందితులను అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్టుల పేరిట ఓటీపీలను అడగడం ద్వారా విదేశాల నుంచి భారీ మొత్తంలో డబ్బును తస్కరించడం గమనార్హం. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. నిత్యం ఏదో ఒక రూపంలో సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి.
ALSO READ | రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల నంబర్ల నుంచి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కస్టమర్ సర్వీస్ పేరుతో మరో తరహా మోసం జరుగుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారికి ఖాతాలను సరపరా చేసే ఓ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెంట్లు పని చేస్తున్నారు. ఇవాళ సైబర్ నేరగాళ్లకు ఖాతాలను అందించే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరతో పాటు 13 మంది ఖాతాదారులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల నుంచి 20 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు 73 కేసుల్లో నిందితులుగా ఉన్నారని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇతర దేశాల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం. కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 8. 2 కోట్లు కొల్లగొట్టారని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు.
సోషల్ మీడియా స్కామ్
సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగిస్తున్నారు. ముందుగా స్కామర్లు నకిలీ ఖాతాలను తయారు చేస్తారు. మోసం చేయాలనుకునే వ్కక్తికి తెలిసిన వారు, బంధువుల ఫొటోలను వాటికి యాడ్ చేస్తారు. అత్యవసరంగా డబ్బు అవసరమైందంటూ చాట్ చేస్తారు. తమ స్నేహితులు, బంధువులే కదా అని చాాలామంది డబ్బులను పంపించి మోసపోతున్నారు.
డిజిటల్ అరెస్ట్
ఉత్తర భారతదేశంలో అనేక మంది డిజిటల్ అరెస్టు స్కామ్ బారిన పడుతున్నారు. ఈ విధానంలో మోసగాళ్లు తాము కస్టమ్స్ లేదా పోలీసు అధికారులమని బాధితులను నమ్మిస్తారు. బాధితుడి పేరిట వచ్చిన పార్సిల్ లో డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలు ఉన్నట్టు చెబుతారు. విచారణ పేరుతో పూర్తిగా భయపెడతారు. దాని నుంచి బయట పడాలంటే డబ్బులు కట్టాలని చెబుతారు. బాధితుడిని వీడియో కాల్ లోనే ఉంచి డబ్బులను తస్కరించి వదిలేస్తారు.