సైబర్ గుబులు..సీబీఐ, ఈడీ పేర్లతో ఫోన్లు

సైబర్ గుబులు..సీబీఐ, ఈడీ పేర్లతో ఫోన్లు
  • జిల్లాలో 680 కేసులు నమోదు
  •  పోగొట్టుకున్న సొమ్ము రూ.44 కోట్లు
  • లెక్కకు రానివి మరెన్నో    
  • బాధితుల్లో విద్యావంతులే ఎక్కువ

సంగారెడ్డి, వెలుగు : ఇటీవల సైబర్ నేరాలు సంగారెడ్డి జిల్లాలో ఎక్కువయ్యాయి. గతంతో పోలిస్తే సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీబీఐ, ఈడీ పేర్లతో ఫోన్లు చేసి డిజిటల్ అరెస్టుల పేరుతో నేరగాళ్లు ఒక్కొక్కరి వద్ద లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలు ఈ మధ్య సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో మోసాలు జరగడం వల్ల అమాయకులు తమ ఖాతాలోని డబ్బులు పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు.

వాటి గురించి కొందరు ధైర్యంగా బయట పెడుతుండగా మరికొందరు ఎవరితో చెప్పుకోలేక తమలోనే మదనపడుతున్నారు. ఈ ఏడాదిలో ఈ తరహా సైబర్ కేసులు జిల్లా వ్యాప్తంగా 680 నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా విద్యావంతులే ఉంటున్నారు. గడిచిన ఏడాదిలో జిల్లాలో రూ.44 కోట్ల పైచిలుకు సొమ్ము పోగొట్టుకున్నట్టు పోలీసులు ధృవీకరిస్తున్నారు. 

 ఫిర్యాదులు 3,801, కేసులు 680

జిల్లాలో జనవరి నుంచి డిసెంబర్ 10 వరకు 3,801 సైబర్ ఫిర్యాదులు అందాయి. ఇందులో 680 కేసులు నమోదు కాగా బాధితులు కోల్పోయింది రూ.44,45,09,346, బాధితుల ఖాతాలో హోల్డ్ చేసిన మొత్తం రూ.5,66,76,450, బాధితులకు తిరిగి ఇచ్చినది రూ.2,20,66,184 మాత్రమే. సంగారెడ్డిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారికి సీబీఐ అధికారుల పేరుతో వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.5 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. పటాన్ చెరుకు చెందిన ఓ వ్యక్తికి ఈడీ అధికారులమంటూ ఫోన్ కాల్ చేసి మాటల్లో పెట్టి రూ.3 లక్షలు కొట్టేశారు. లక్డారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ముంబై ఈడీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేసి మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్టు బెదిరించి రూ.3 లక్షలు కాజేశారు. 

పటాన్ చెరు ఏపీఆర్ కు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ఉద్యోగి స్టాక్ మార్కెట్ పేరుతో వచ్చిన మెసేజ్ కు రెస్పాండ్ అయ్యాడు. ఆ తర్వాత ఐడీని క్రియేట్ చేసి దశలవారీగా ఇన్వెస్ట్ చేసిన రూ.82 లక్షలతో కలిపి మొత్తంగా వాలెట్లో రూ.కోటీ 30 లక్షలు చూపించారు. టాక్స్ పేరుతో మరో రూ.17 లక్షలు చెల్లిస్తే అంతా డ్రా చేసుకోవచ్చని నమ్మించి ఆ మొత్తం కాజేసి మోసం చేశారు. విషయాన్ని గ్రహించిన బాధితుడు పీఎస్​లో ఫిర్యాదు చేయగా డబ్బులు పంపిన అకౌంట్లో ఉన్న రూ.24 లక్షల నగదును హెూల్డ్ లో పెట్టారు.

ALSO READ : ముదురుతున్న కోర్టు కాంప్లెక్స్ స్థల వివాదం..రెండు వర్గాలుగా విడిపోయిన లాయర్లు

సంగారెడ్డికి చెందిన రమేశ్ కు అక్టోబర్ లో పాకిస్తాన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్ కాల్ చేసి సీబీఐ అధికారి పీటర్ గా పరిచయం చేసుకున్నాడు. మీరు అక్రమంగా డబ్బు సంపాదించినట్టు ఆధారాలు ఉన్నాయని బెదిరించాడు. కేసు నుంచి తప్పించుకోవాలంటే మీకు వచ్చే ఓటీపీ చెప్పాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భయపడిన రమేశ్ విషయాన్ని తన కొడుకుకు చెప్పగా మళ్లీ కాల్ వస్తే ఆ ఫోన్ ఎత్తొద్దని చెప్పడంతో ముప్పు తప్పింది..

అలర్ట్ గా ఉండండి

సైబర్ నేరాలు ఇటీవల జిల్లాలో బాగా పెరిగాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు  మోసాలకు పాల్పడుతున్నారు. అలర్ట్ గా ఉంటే ఎంతటి మోసానైనా నివారించవచ్చు. ఏ అధికారైన ఫోన్​లో  విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలి. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్, వీడియో కాల్స్ చేస్తే ఎత్తొద్దు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండి స్థానిక పోలీసులను ఆశ్రయించి జాగ్రత్త పడాలి.

–రూపేశ్, జిల్లా ఎస్పీ