- రూ. 50 వేలు పంపితే వదిలేస్తామంటూ సైబర్ నేరగాళ్ల కాల్
బాల్కొండ, వెలుగు: హలో మాట్లాడేది మాధవరెడ్డేనా మీ కూతురు డ్రగ్స్ కేసులో పట్టుబడింది. రూ. 50 వేలు పంపిస్తే వదిలేస్తా అంటూ సైబర్ నేరగాడు ఫోన్ కాల్ చేసి బెదిరించిన ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో జరిగింది. పోలీస్ డీపీతో +923422812353 నుంచి మాధవరెడ్డి కి కాల్ వచ్చింది.
మీ పాప డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని ఢిల్లీ తీసుకెళ్తున్నామని నమ్మించి రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఫ్రెండ్ సాయంతో అప్రమత్తమైన మాధవ రెడ్డి తన కూతురుకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్న సమాచారం తెలుసుకుని డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. దీంతో సైబర్ మోసగాడు రూ.50 వేల నుంచి రూ.10 వేలకు బేరం ఆడాడు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులను సంప్రదించాలని సూచించారు.