- ఇంటి లోన్ పేరిట మోసగించిన సైబర్ నేరగాళ్లు
- మనస్తాపంతో చెరువులో దూకి యువకుడు సూసైడ్
- కామారెడ్డి జిల్లా ఐలాపూర్ లో విషాదం
లింగంపేట, వెలుగు: ఇంటి లోన్ పేరిట డబ్బులు తీసుకుని సైబర్‌నేరగాళ్లు మోసగించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి గంగరాజు(29)కు కొద్ది రోజుల కింద 8981354571 నంబర్ నుంచి కాల్ వచ్చింది. బెంగళూరు సిటీలోని లోన్ యాప్ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని.. రూ.2 లక్షలు ఇంటి లోన్ ఇస్తామని తెలిపారు. అయితే.. ముందుగా డిపాజిట్ కింద రూ.70 వేలు చెల్లించాలని సూచించారు.
దీంతో నిజమనుకుని నమ్మిన గంగరాజు పలుమార్లు ఫోన్ పే ద్వారా రూ.52,500 వచ్చిన ఫోన్ నంబర్ కు ఆన్లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం ఎలాంటి రిప్లై లేకపోవడంతో ఫోన్ చేసిన వ్యక్తికి కాల్ చేసి ప్రశ్నించగా తనకేం తెలియదని దాటవేశాడు. దీంతో మోసపోయానని మనస్తాపం చెందిన గంగరాజు ‘‘ నా చావుకి వాడే కారణం.. ఇంటి లోన్‌కు చెల్లించిన డబ్బులను నా కుటుంబ సభ్యులకు ఇప్పించండి.. నేను చనిపోయాక నా ఫ్రెండ్స్ అంతా చూసేందుకు రండి’’.. అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్చేశాడు.
శనివారం సాయంత్రం ఇంట్లోంచి గంగరాజు వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గాలింపు చేపట్టగా.. ఐలాపూర్ఊర చెరువు తూము వద్ద చెప్పులు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లతో వెళ్లి చెరువులో గాలించగా గంగరాజు డెడ్ బాడీ దొరికింది. లోన్పేరిట సైబర్ నేరగాళ్లు మోసగించడంతోనే అతడు సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. గంగరాజుకు భార్య సోని, ఐదేండ్ల కూతురు ఉన్నారు. మృతుడి తల్లి అనసూయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.