
బషీర్‌బాగ్, వెలుగు: పార్ట్ టైం జాబ్ పేరిట ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళకు IHCL కంపెనీ నుంచి అంటూ స్కామర్స్ వాట్సాప్ కాల్ చేశారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు పార్ట్ టైంగా సంపాదించవచ్చని ఆశచూపారు. గూగుల్ లో హోటల్స్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ఇవ్వాలని సూచించారు.
ఆమె ఓ టాస్క్ పూర్తి చేసి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను షేర్ చేసింది. కాసేపటికి ఫోన్ పే లో రూ.203 క్రెడిట్ అయ్యాయి. నమ్మకం కలిగి, మరికొన్ని టాస్క్ లు పూర్తి చేసింది. అధిక లాభాలు వస్తాయంటూ స్కామర్లు ఆమె నంబర్‌ను వీఐపీ గ్రూప్ పేరిట ఉన్న టెలిగ్రామ్ లో యాడ్ చేశారు. వారు సూచించిన అకౌంట్ లలో పలు దఫాలుగా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది.
తర్వాత లాభాలు ఇవ్వకపోగా ఇంకా ఇన్వెస్ట్ చేయాలంటూ ఒత్తిడి చేయడంతో ఇది స్కామ్ అని గ్రహించింది. తాను మొత్తం రూ. 1,35,199 పోగొట్టుకున్నానని మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.