ఏసీబీ పేరిట ప్రభుత్వోద్యోగికి టోకరా.. అరెస్ట్ తప్పిస్తామని డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఏసీబీ పేరిట ప్రభుత్వోద్యోగికి టోకరా.. అరెస్ట్ తప్పిస్తామని డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

బషీర్​బాగ్​, వెలుగు: ఏసీబీ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు ఓ ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేశారు. సిటీకి చెందిన 58 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి రెండు వారాల కింద ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఏసీబీ అధికారిగా తనను పరిచయం చేసుకున్నాడు. బాధిత ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, విచారణ చేసేందుకు బ్యాంక్ వివరాలతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కోరాడు. 

అలాగే అతడిని అరెస్టు చేయాల్సి వస్తుందని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తాము అడిగిన డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. భయపడిన ఉద్యోగి స్కామర్లు ఇచ్చిన రెండు మొబైల్ నంబర్లకు మొత్తం రూ.1,00,000 లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపగా, వారు మోసం పోయామని గ్రహించి బాధితుడితో సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముద్ర లోన్ వచ్చిందని మోసం

ఇబ్రహీంపట్నం: ముద్ర లోన్ మంజూరైందని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. యాచారం సీఐ నంధీశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్​గల్​గ్రామానికి చెందిన రామన్న(37)కు గత నెల 4న ఓ ఫోన్​ కాల్ వచ్చింది. రూ.5 లక్షల ముద్ర లోన్​వచ్చిందని, లోన్ కావాలంటే ధ్రువపత్రాలు, అందుకు రుసుం చెల్లించాలని నమ్మించారు. 

దీంతో నమ్మిన బాధితుడు అన్ని పత్రాలు వాట్సాప్​లో, ఫోన్ పేలో పలుమార్లుగా రూ.45,490 ట్రాన్స్​ఫర్ చేశాడు. ఆ తర్వాత సైబర్ కేటుగాళ్లు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు
 దర్యాప్తు చేస్తున్నారు.