బషీర్ బాగ్, వెలుగు : ఇన్స్టాగ్రామ్ ద్వారా సూట్ బుక్‌చేసుకున్న యువకుడి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.21 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి తొలుత ఇన్‌స్టాలో ఇమ్రాన్ టెక్స్ టైల్స్ పేరిట ఓ యాడ్‌ను చూశాడు. అందులోని సూట్ అతనికి నచ్చడంతో, వాటి వివరాల కోసం అభ్యర్థించాడు. దీంతో బాధితుడి వాట్సాప్ కు స్కామర్లు వివరాలు పంపించారు. సూట్ ధరను రూ. 1,799గా , డెలివరీ చార్జీస్ రూ.100గా చెప్పి బాధితుడికి ఓ లింక్ ను షేర్ చేశారు.
ఆ లింక్ ద్వారా బాధితుడు రూ .1900 బదిలీ చేశాడు. అయితే, ఆ డబ్బులు తమకు రాలేదని బుకాయించిన స్కామర్లు మరోసారి డబ్బులు పంపించాలని తెలిపారు. మొదట పంపిన డబ్బులు తమకు రాగానే తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో బాధిత యువకుడు మరోసారి డబ్బులను బదిలీ చేశాడు. కొద్దిసేపటికి బాధితుడికి స్కామర్లు ఒక్క రూపాయిని బదిలీ చేశారు. అనంతరం లింక్ ను పంపి క్రెడిట్ కార్డు ఆప్షన్ ను క్లిక్ చేయమని సూచించారు.
డబ్బులు తిరిగి పంపేందుకు అనుకొని బాధితుడు క్రెడిట్ కార్డు వివరాలను షేర్ చేశాడు. ఓటీపీ వివరాలను కూడా స్కామర్లతో పంచుకున్నాడు. వెంటవెంటనే అతని కార్డు నుంచి డబ్బులు కట్ కావడంతో కంగుతిన్న బాధిత యువకుడు స్కామర్లను నిలదీశాడు. టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఇలా జరిగిందని తెలిపిన స్కామర్లు 24 గంటల్లో డబ్బులను తిరిగి పంపిస్తామన్నారు. కానీ, స్కామర్లు బాధితుడి కాల్స్ కు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. మొత్తం రూ.1.21 లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.