
హైదరాబాద్: పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు కట్టడి చేస్తోన్నప్పటికీ రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలోనే మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. మీ కరెంట్ బిల్ పెండింగ్‌లో ఉంది.. డబ్బులు చెల్లించాలని ఫోన్లకు మెసేజ్, లింక్ పంపుతున్నారు.
సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే మీ ఇంటికి కరెంటు కట్ అవుతోందని బెదిరిస్తున్నారు. కరెంట్ కట్ కాకుండా ఉండాలంటే మీ ఫోన్‌కు వచ్చిన లింక్ ద్వారా బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే కరెంట్ కట్ అవుతుందేమోనని ఆందోళనకు గురై సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేస్తు్న్నారు ప్రజలు. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్లలో ఉన్న డబ్బంతా మాయం అవుతోంది.
ALSO READ | బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ అప్డేట్.. రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్ ఇవే
మహారాష్ట్ర, బీహార్ నుంచి కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మీకు ఇలాంటి మేసేజులు వస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు పోలీసులు. 89679 54941 నెంబర్ నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయని.. ఈ నెంబర్ నుంచి వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయొద్దని సూచించారు.