సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్​ టార్గెట్​గా సైబర్​ మోసాలు

సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్​ టార్గెట్​గా సైబర్​ మోసాలు

మెదక్/ సంగారెడ్డి/ సిద్దిపేట/ వెలుగు: ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ మోసాలు పెరిగాయి. నేరగాళ్ల వలలో చాలా మంది  చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. యువకులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు, మహిళలు కూడా బాధితులుగా మారుతున్నారు. లక్షలు సంపాదించవచ్చని మాయమాటలు చెబుతూ.. వాట్సాప్​, ఫేస్​బుక్ లో లింకులు పంపుతూ అకౌంట్​ ను ఖాళీ చేస్తున్నారు.  

సంగారెడ్డిలో అధికం..

ఉమ్మడి జిల్లాలో  రెండు, మూడు నెలల్లో పదుల సంఖ్యలో సైబర్​ మోసాలు వెలుగు చూశాయి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ క్రైమ్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సైబర్​ నేరగాళ్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ .. ఆన్ లైన్ బిజినెస్ పేరుతో పెట్టుబడుల ఆశ చూపి మోసం చేస్తున్నారు. సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంత వాసులు ఎక్కువగా మోసపోయినట్టు పలు సంఘటనలు బయటపడ్డాయి. పటాన్​ చెరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.95 లక్షలు లాస్​ అయ్యాడు.

సిద్దిపేట జిల్లాలోనూ అనేక మంది సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని లింకులు ఓపెన్​ చేసి లక్షలు పోగొట్టుకున్నారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం పొందవచ్చని తెలపడంతో షేర్స్​ కొని రూ.80.60 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. మెదక్​ జిల్లా తూప్రాన్​ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల సైబర్​ మోసంతో రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. 

జాగ్రత్త ఇలా.. 


సైబర్​ నేరస్తుల వలలో చిక్కకుండా ఉండేందుకు పోలీసులు అవసరమైన ఈ సూచనలిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు లోన్ ఇస్తాం అని చెప్తే నమ్మొద్దు.లోన్స్ కోసం నేరుగా బ్యాంక్​కు వెళ్లాలి. మీకు డబ్బులు వచ్చాయి అని చెప్పి,  ప్రాసెసింగ్​  కోసం ఫీజు కింద  డబ్బులు  అడిగితే  వాళ్ళు సైబర్ మోసగాళ్లు అని గుర్తించాలి. ఆఫర్స్ లేదా స్క్రాచ్ కార్డ్స్ సంబంధించి అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే క్లెయిమ్​ చేస్కోండి. బ్యాంక్ అకౌంట్​ నెంబర్​లు, పాస్ వర్డ్​లు, ఓటీపీలు ఎవరికి పడేతే వారికి ఇవ్వొద్దు.

వాట్సప్, ఫేస్​ బుక్, ఇన్​స్ట్రాగ్రామ్​లో ఎవరైన తెలియని వ్యక్తి నుండి గాని, తెలిసిన ఫోటో ఉన్న ప్రొఫైల్ నుంచి గాని .APK, .EXE ఫైల్ వస్తే వాటిని డౌన్​ లోడ్​చేసి ఇన్​ స్టాల్​ చేయొద్దు. అలాంటి ఫైల్స్ మీ మొబైల్ కి వచ్చే కాల్స్ , మెసేజెస్ ని సైబర్ మోసగాళ్లకు ఫార్వర్డ్ చేస్తాయి. .EXE ఫైల్స్ మీ కంప్యూటర్ లో వున్న మీ వ్యక్తి గత, బ్యాంకింగ్ కి సంబంధిన పూర్తి వివరాలను సైబర్ మోసగాళ్లకు అందచేస్తాయి. అన్ అఫీషియల్  స్టోర్లు, థర్డ్ పార్టీ యాప్ ల  ను  ఇన్​ స్టాల్​ చేసుకునే యాప్స్ లో మాల్వేర్, స్పైవేర్   వ్యక్తిగత సమాచారం,  పాస్​వర్డ్​లను  దోచేస్తాయి.ఎవరైనా సైబర్​ మోసానికి గురైతే 1930 టోల్​ ఫ్రీ నెంబర్​కు కాల్​ చేసి చెప్పాలి. లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ప్రజలకు పోలీసుల అవగాహన..

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మూడు జిల్లాల్లోనూ కమిషనర్, ఎస్పీల ఆదేశాల మేరకు సైబర్​ క్రైమ్​ డిపార్ట్​మెంట్​ అధికారులు సైబర్​ క్రైమ్స్​పై కాలేజీలు, స్కూల్​లు, గ్రామాలలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మోసాలు జరుగుతున్నాయిలా... 

సైబర్ మోసగాళ్లు ప్రముఖ లోన్ సంస్థల పేర్లతో లోన్స్ ఇస్తాం అని చెప్పి మోసాలు చేస్తున్నారు. లోన్ రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇతర చార్జీల కింద అమౌంట్ పంపాలని చెప్పి డబ్బులు కాజేస్తారు.ఎలక్ట్రానిక్, బట్టలు, ఇతర నకిలీ ప్రకటనలతో ఆకర్షించి మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా బ్యాంకు వివరాలు, ఓటీపీ తెలుసుకొని బ్యాంకు ఖాతాలోని డబ్బులుదోచేస్తున్నారు.ప్రభుత్వ పథకాల పేరుతో కాల్స్ చేసి మాయమాటలు చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. కంపెనీ ఆఫర్స్ ఇస్తుంది అని చెప్పి మోసాలు చేస్తున్నారు.