కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీకి సైబర్ వేధింపులు

కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీకి సైబర్ వేధింపులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ కె పద్మనాభయ్య (86) ను సైబర్‌‌‌‌ నేరగాళ్లు వేధించారు. ఫెడెక్స్  కొరియర్‌‌‌‌లో డ్రగ్స్  వచ్చాయని, కేసు నమోదవుతుందని, కేసు నమోదు కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని బెదిరించారు. అయితే, ఇదంతా సైబర్ నేరస్థుల పని అని గుర్తించిన పద్మనాభయ్య అలర్ట్ అయి తనను తాను కాపాడుకున్నారు. పద్మనాభయ్య ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌‌కు చైర్మన్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల చివరి వారంలో ఆయనకు ఫెడెక్స్ కొరియర్‌‌‌‌ నుంచి పార్సిల్ వచ్చినట్లు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. 

ముంబై నుంచి ఇరాన్‌‌కు షిప్పింగ్‌‌ బుక్ చేసుకున్నారని చెప్పారు. పార్సిల్‌‌లో డ్రగ్స్‌‌, క్రెడిట్ కార్డులు, పాస్‌‌పోర్టులు, ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయని, ఆ పార్సిల్‌‌ను తాము పట్టుకున్నామని నమ్మించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆయనకు కాల్‌‌ చేసింది. తనకు తాను ఫెడెక్స్‌‌ ఎంప్లాయీగా చెప్పుకుంది. ఆగస్ట్‌‌  23న ఏదైనా పార్సిల్ పంపించారా అని ఆయనను ప్రశ్నించింది. దీంతో తాను ఎలాంటి పార్సిల్ పంపించలేదని పద్మనాభయ్య స్పష్టం చేశారు. కానీ పద్మనాభయ్య పేరు, ఫోన్ నంబర్‌‌‌‌తో ముంబై నుంచి ఇరాన్‌‌కు ప్యాకేజీ పంపించారని ఆ మహిళ బుకాయించింది. 

ఆ సరుకును కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని చెప్పింది. ఆ తరువాత ముఖేష్ పేరుతో మరో సైబర్ నేరగాడు పద్మనాభయ్యతో మాట్లాడాడు. తాను అంధేరి ఈస్ట్‌‌ బ్రాంచ్‌‌ ఫెడెక్స్ ఎంప్లాయీగా చెప్పుకున్నాడు. పద్మనాభయ్యకు చెందిన క్రెడిట్ కార్డుతో రూ.93,410 షిప్పింగ్ చార్జీలు చెల్లించానని చెప్పాడు. తాను ఎలాంటి పార్సిల్ చేయలేదని పద్మనాభయ్య చెప్పినా సైబర్  కేటుగాళ్లు పట్టించుకోలేదు. ఆ వెంటనే ముంబై సైబర్  క్రైం సెల్‌‌లో ఆన్‌‌లైన్  కంప్లైంట్‌‌ ఉన్నట్లు మరో సైబర్ నేరగాడితో కాల్  చేయించారు.

స్కైప్‌‌‏లో ఆన్‌‌లైన్‌‌లోకి రావాలని ఆదేశించారు. తాను స్కైప్‌‌  వినియెగించనని పద్మనాభయ్య చెప్పడంతో తమ యాప్  డౌన్‌‌లోడ్  చేసుకోవాలన్నారు. ఆయన వినకపోవడంతో అసభ్యకరంగా దూషించారు. ఆ తరువాత కాల్ కట్‌‌ చేశారు. ఇదంతా సైబర్  నేరగాళ్ల స్కెచ్‌‌ అని పద్మనాభయ్య గుర్తించారు. తర్వాత సిటీ సైబర్  క్రైం పోలీసులకు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.